బీజేపీ మీద మాట సరే.. మన సంగతేంటి సారూ?

బీజేపీ ప్రకటిస్తున్న ఎంపీ అభ్యర్థుల్లో బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

Update: 2024-03-14 04:05 GMT

బీజేపీకి సరైన అభ్యర్థులు దొరకని కారణంగానే తమ పార్టీకి చెందిన నేతల మీద గురి పెట్టినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఈ కారణంగానే సిట్టింగ్ ఎంపీలు.. ఇతర నేతల్ని చేర్చుకొని టికెట్లు ఇస్తున్నట్లుగా మండిపడుతున్నారు. ప్రధానమంత్రి మోడీని చూపించి ఏదో హడావుడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆయన.. గతాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. బీజేపీ ప్రకటిస్తున్న ఎంపీ అభ్యర్థుల్లో బీఆర్ఎస్ కు చెందిన వారు ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.

అయితే.. గులాబీ సారు మర్చిపోతున్న సంగతేమంటే.. గతంలోనూ తాను వేరే పార్టీ అభ్యర్థులను హైజాక్ చేసి.. టికెట్లు కట్టబెట్టానని. మరి.. అప్పట్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేకనే.. అలా చేశారా? మాట అనే ముందు గతాన్ని కాస్త గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఆయన మర్చిపోకూడదు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏమేం చేశానో.. ఇప్పుడవన్నీ గోడకు కొట్టిన బంతి మాదిరి రిపీట్ కావటం కనిపిస్తుంది.

పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతల్ని ఉద్దేశించి ఆయన కాసింత ఘాటుగా మాట్లాడుతున్నారు. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా బీఆర్ఎస్ ను వదిలేసి ఇతర పార్టీల్లో చేరుతున్న నేతలకు అక్కడ పెద్దగా ఆదరణ ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న ఆయన.. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న పలువురిని పట్టించుకోకపోవటాన్ని గుర్తు చేస్తున్నారు. బీజేపీకి నిజంగా బలం ఉంటే.. వారి పార్టీల్లో అభ్యర్థులు ఎందుకు దొరకటం లేదన్న ప్రశ్న వేస్తున్నారు.

ఇదే సందేహం గతంలో గులాబీ బాస్ కు ఎందుకు కలగలేదన్న మాటనను పలువురు సంధిస్తున్నారు. ఇతరపార్టీల నుంచి నేతల్ని గులాబీ కారు ఎక్కించేయటం ఎందుకు జరిగినట్లు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యూచర్ లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని.. బీఆర్ఎస్ బీఫారం ఇస్తే చాలు.. గెలుపు ఖాయమనే పరిస్థితి వస్తుందన్న కేసీఆర్ మాటలు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పటికి వాస్తవాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో కేసీఆర్ లేరన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని.. ఈ ప్రజా వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకోవటానికి బీఆర్ఎస్ ముఖ్యులు.. మాజీ ఎమ్మెల్యేలు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్న కేసీఆర్.. వాస్తవానికి దూరంగా ఆయన అంచనాలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News