బీఎస్పీతో పొత్తు భేటీ సరే.. సింహం మాటేమైంది సారూ?

ఒకట్రెండు రోజుల్లో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళలో.. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు.

Update: 2024-03-14 04:22 GMT

కాల మహిమను అస్సలు తక్కువగా అంచనా వేయలేం. అధికారం చేతిలో ఉన్నప్పుడు దాని పట్ల ఒద్దికగా వ్యవహరిస్తే కలిగే ప్రయోజనం ఎలా ఉంటుందన్న విషయంపై గులాబీ బాస్ కేసీఆర్ కు ఇప్పటికి అర్థం కాకపోవచ్చనే చెప్పాలి. తెలంగాణలో తిరుగులేని అధికార పక్షంగా పెత్తనం చెలాయించే వేళలో.. పొత్తులు పెట్టుకునే పార్టీలను అవహేళన చేయటం.. తమకు ఎవరి పొత్తు అవసరం లేదని బడాయి మాటలు చెప్పుకోవటం.. చిన్న పార్టీలంటూ చులకన చేయటం తెలిసిందే. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి హోదాలో చిన్న పార్టీకి చెందిన కీలక నేతల్ని దగ్గరకు రానిచ్చేవారు కాదు. కనీసం వినతిపత్రానికి అనుమతి ఇవ్వాలన్నా ససేమిరా అనేవారు.

అలాంటి గులాబీ బాస్ కేసీఆర్.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న వేళలో.. బీఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ గులాబీ బాస్ తో భేటీ కావటం.. సుదీర్ఘ చర్చలు జరపటం తెలిసిందే. తాజాగా బీఎస్పీ ఎంపీ రాంజీ గౌతమ్ హైదరాబాద్ వచ్చారు. కేసీఆర్ నివాసంలో భేటీ అయ్యారు. వారి మధ్య పొత్తు చర్చలు జరిగాయని.. సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా చెబుతున్నారు.

ఒకప్పుడు టైం ఇవ్వటానికి సైతం ససేమిరా అనే కేసీఆర్.. ఈ రోజున పెద్దగా ఉనికి లేని బీఎస్పీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాంజీ గౌతమ్ తో భేటీ కావటం ఆసక్తికరంగా మారింది. కేసీఆర్ తో భేటీ అనంతరం బీఆర్ఎస్ తో చర్చలు సక్సెస్ అయినట్లుగా చెప్పారు. నాగర్ కర్నూల్.. అదిలాబాద్ స్థానాల్లో పోటీకి బీఎస్సీ ఆసక్తి చూపుతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. తాజాగా జరిగిన భేటీకి సంబంధించిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటే.. ఒక స్థానాన్ని బీఎస్పీకి కేటాయిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో సింహం సింగల్ గా వస్తుందంటూ మాట్లాడిన గులాబీ నేతలు.. ఇప్పుడేమంటారు? అని ప్రశ్నిస్తున్నారు. అందుకే అంటారు కాలం కలిసి వచ్చిన వేళ.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే వచ్చే తిప్పలు ఇలానే ఉంటాయన్న మాట పలువురి నోట రావటం గమనార్హం.

Tags:    

Similar News