భార్యను కూడా కాదని.. అతిషి ఎంపికలో కేజ్రీవాల్ 'రాజకీయం'!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన తర్వాత అతిషిని ఎంపిక చేయడం వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా తన తర్వాత అతిషిని ఎంపిక చేయడం వెనుక ప్రస్తుత ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చాలా కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు రాజీనామా చేయాలన్న ఆలోచన దాదాపు నెల రోజుల కిందటే వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. అప్పట్లో మౌనంగా ఉన్న కేజ్రీవాల్.. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన రెండో రోజే తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ప్రదానంగా రెండు పేర్లు తెరమీదికి వచ్చాయి. వీటిలో తొలి పేరు అతిషినే కావడం గమనార్హం.
రెండో పేరు సీఎంకేజ్రీవాల్ సతీమణి సునీత. సహజంగా ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు రాజీనామా లు చేయడం ఇప్పుడు మాత్రమే కొత్తకాదు. ఇటీవల జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరేన్ (ఇటీవల మళ్లీ సీఎం అయ్యారు) కొన్నాళ్ల కిందట గనుల కుంభకోణం కేసులో అరెస్టయ్యారు. ఈ క్రమంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. తమ కుటుంబానికి విధేయుడైన చెంపయి సొరేన్‌కు ఈ పదవిని ఇచ్చారు. అయితే..ఈ యన బీజేపీతో చేతులు కలపడం.. ఇంతలోనే.. హేమంత్‌కు బెయిల్ రావడంతో మరోసారి సొరేన్ ప్రమాణంచేశారు.
గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి కుంభకోణంలో రాజీనామా చేసినప్పు డు ఆయన సతీమణి రబ్రీదేవిని ముఖ్యమంత్రిని చేశారు. ఈ పరంపరలో కేజ్రీవాల్ సతీమణిసునీత పేరు వినిపించింది. పార్లమెంటు ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో ప్రచారాన్ని సునీతే తన భుజాలపై వేసుకున్నారు. దీంతో సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా ప్రకటించగానే సునీత పేరు కూడా తెరమీదికి వచ్చింది. అయినా.. కూడా ఆమెను కాదని.. అతిషి వైపు కేజ్రీవాల్ మొగ్గు చూపారు.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవరన్నర్ సక్సేనాతో గత ఆరు మాసాలుగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా అతిషి పోరాడారు. దీంతో కొన్నికొన్ని విషయాల్లోసక్సేనా వెనుకడుగు వేయాల్సి వచ్చింది. ఇక, రెండోది అత్యంత కీలకమైన మొహల్లా క్లినిక్స్, విద్యావ్యవస్థలోమార్పులు వంటివాటికి అతిషినే కారణం. ఈ రెండే పార్టీకి రెండోసారి కూడా అధికారం తెచ్చిపెట్టారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కీలకమైన అతిషి వైపు కేజ్రీవాల్ మొగ్గు చూపారని అంటున్నారు పరిశీలకులు.