నేను గానీ .. జైలులో గానీ ఉంటే .. !
‘వచ్చే శాసనసభ ఎన్నికల వరకు నేను జైల్లోనే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 70 సీట్లకు 70 గెలుచుకుంటుందని’ జోస్యం చెప్పాడు
మద్యం సిండికేట్ కుంభకోణంలో జైలుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మధ్యంతర బెయిలు మీద బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ‘నేను తిరిగి జైలుకు పోవద్దు అనుకుంటే ఇండియా కూటమిని గెలిపించాలని, లేదంటే జూన్ 4 తర్వాత జైలుకు వెళ్తే తిరిగి ఎప్పుడు వస్తానో చెప్పడం కష్టం’ అని జైలు నుండి వచ్చిన తర్వాత కార్యకర్తల సమావేశంలో కేజ్రివాల్ వ్యాఖ్యానించాడు.
అయితే తాజాగా కేజ్రివాల్ మరో వాదన వినిపిస్తున్నాడు. ‘వచ్చే శాసనసభ ఎన్నికల వరకు నేను జైల్లోనే ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 70 సీట్లకు 70 గెలుచుకుంటుందని’ జోస్యం చెప్పాడు. ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు.
నేను జైల్లోనే ఉన్నా తన భార్య ఎన్నికల్లో పోటీ చేయదని నేను మాత్రం జైలు నుంచే పోటీ చేస్తానని, అప్పుడు ఢిల్లీలో ఆప్ అన్ని స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఢిల్లీ ప్రజలు అమాయకులు కారని ? వారు అన్నీ గమనిస్తున్నారని, తమ ఎమ్మెల్యేలను జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలనుకుంటే వారు చూస్తూ ఊరుకోరని కేజ్రివాల్ అన్నారు.
ఢిల్లీలో ఆప్ ను ఓడించలేమన్న భయంతోనే ప్రధాని మోదీ మద్యం కేసులో తమను ఇరికించే ప్రయత్నం చేశారని కేజ్రివాల్ ఆరోపించారు. నేను రాజీనామా చేస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆగానని, నేను ఎంతకాలం జైలులో ఉంటానన్నది మోడీ చేతుల్లోనే ఉందని కేజ్రివాల్ చెప్పడం గమనార్హం. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే కేజ్రివాల్, మంత్రి సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత తదితరులు అరెస్టయి జైల్లో ఉన్నారు.