అమెరికా పట్ల కిమ్ స్టైల్ మారింది... ట్రంప్ అయినా తగ్గేదేలేదట..!
ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్ గురించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.
ఈ జనరేషన్ కు కూడా నియంతల పాలన ఎలా ఉంటుందో చూపిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా నియంత కిమ్ గురించి ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ అగ్రరాజ్యంతో ఉత్తర కొరియా సంబంధాలపై కిమ్ ఆలోచనా విధానం మారిందని అంటున్నారు.
అవును... అమెరికాతో దౌత్యం విషయంలో ఉత్తరకొరియా తన రూటు మార్చిందని తెలుస్తోంది. వాస్తవానికి ఉత్తర కొరియా నుంచి యూఎస్ పారిపోయిన ఓ మాజీ దౌత్యవేత్త ఇటీవల మాట్లాడుతూ.. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడైతే అతడితో చర్చలు జరపాలని కిమ్ సర్కార్ భావిస్తోందని అన్నారు.
ఇదే సమయంలో హారీస్ ను ఓడించి ట్రంప్ ను అధికారంలోకి తీసుకొచ్చేలా ఉత్తరకొరియా అధికారులు వ్యూహరచన చేస్తున్నట్లు అంచనా వేశారు. ట్రంప్ అధ్యక్షుడైతే అతనితో దౌత్య చర్యలు జరిపి.. ప్రధానంగా ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను తుడిపేసుకోవడంతోపాటు తమపై ఉన్న పలు ఆంక్షలు తొలగించుకోవాలని కిమ్ లక్ష్యంగా పెట్టుకున్నారని వెళ్లడించారు.
అయితే తాజాగా న్యూయార్ లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశల్లో మాట్లాడిన ఉత్తరకొరియా దూత సాంగ్ కిమ్... దౌత్యం విషయంలో ఉత్తరకొరియా రూటు మార్చిందని.. ఇకపై వ్యక్తిగత దౌత్యాలు జరపకూడదని నిర్ణయించిందని తెలిపారు. అమెరికాలో ఎవరు అధికారంలోకి వచ్చినా.. ఆ ప్రభుత్వంతోనే డీల్ చేస్తామని అన్నారు.
కాగా... ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరకొరియా విషయంలో కాస్త పట్టువిడుపులతో వ్యహరించారు. 2019లో వియాత్నాంలో ట్రంప్ – కిమ్ జోంగ్ ఉన్ భేటీ అయ్యారు కూడా. అయితే... అణ్వాయుధాలు వదిలేసే విషయంలో కిమ్ వెనక్కి తగ్గకపోవడంతో.. చర్చలు సఫలం కాలేదు.
అనంతరం బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అమెరికాతో ఉత్తర కొరియాకు దూరం పెరిగింది. అయితే... ఈసారి అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటికీ వ్యక్తిగత దౌత్యాలు జరపకూడదని.. ఏ కార్యవర్గం అధికారంలోకి వచ్చినా డీపీఆర్కే తో వ్యవహారాలు జరపాల్సి ఉంటుందని ఐరాస లో ఉ.కొరియా దూత చెప్పడం ఇప్పుడు ఆసక్తిగా మారింది.