మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు కాళీకి రిమాండ్
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం కేసులో ఏ1 మెరుగుమాల కాళీకి కోర్టు రిమాండ్ విధించింది.
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడు, టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై హత్యాయత్నం కేసులో ఏ1 మెరుగుమాల కాళీకి కోర్టు రిమాండ్ విధించింది. అస్సాంలో తలదాచుకున్న కొడాలి ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీని మంగళవారం అరెస్టు చేయగా, బుధవారం కోర్టులో హాజరుపరిచారు.
క్రిష్ణా జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న కాళీ గత కొంత కాలంగా పరారీలో ఉన్నాడు. టీడీపీ నేత రావిపై హత్యాయత్నం కేసులో ఆయన సహచరులు 13 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు వారిచ్చిన సమాచారంతో అస్సాంలో చేపల వ్యాపారం చేస్తున్న కాళీని గుడివాడ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం నిందితుడిని గుడివాడ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 10 వరకు రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు. దీంతో నిందితుడు కాళీని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
వైసీపీ అధికారంలో ఉండగా, 2022 డిసంబర్ 25న గుడివాడలో టీడీపీ కార్యాలయం, రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది. ఇందులో కాళీ ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై అప్పట్లోనే కేసు నమోదైనా, అప్పటి మంత్రి కొడాలి ప్రమేయంతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు బూజు దులిపిన పోలీసులు 13 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరంతా వైసీపీ కార్యకర్తలేనని గుర్తించారు. పోలీసులు తన కోసం వేటాడుతున్నారని గుర్తించిన ప్రధాన నిందితుడు కాళీ, గుడివాడ నుంచి పారిపోయి అస్సాంలో తలదాచుకుంటున్నాడు. ఈ సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు అక్కడ చేపల మార్కెట్లో చేపల వ్యాపారం చేస్తున్న కాళీని అరెస్టు చేశారు.