కేటీఆర్ కి ఎంజాయ్ టైమ్...దానికో లెక్కుంది !
అయితే ఈ కేసుల విషయంలో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది.
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ మీద ఇపుడు కేసుల ముసురు అలుముకుంది. ఆయన మీద ఫార్ములా ఈ-కార్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా ఇదే కేసులో ఎంటర్ అయింది. అయితే ఈ కేసుల విషయంలో కేటీఆర్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పు రిజర్వ్ లో ఉంచారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్ కేసుల మీద మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేశారు. కేటీఅర్ ని రెండు రోజుల పాటు ఎంజాయ్ చేయనివ్వండి అంటూ ఆయన మీడియాతో అన్న మాటలు ఇపుడు వైరల్ అవుతున్నాయి
కొత్త ఏడాదిని రోజుని ఆయన పూర్తిగా ఎంజాయ్ చేయనివ్వండి ఎందుకు బాధ పెట్టడం అంటూ కోమటిరెడ్డి కామెంట్స్ చేశారు. అలా ఆయన్ని ఒకటి రెండు రోజులు 2025లో ఎంజాయ్ చేయనిద్దామని అన్నారు. ఆ మీదట జనవరి 3, 4 తేదీలలో చూడాల్సింది చూద్దామని కోమటిరెడ్డి అంటున్నారు.
అంటే కేటీఆర్ కి కొత్త ఏడాది మొదలవుతూనే ఇబ్బందులు ఉంటాయని చెప్పకనే మంత్రి చెప్పేశారు అన్న మాట. అది కూడా 2024 వాకిట నిలిచి 2025కి అంతా స్వాగతం పలుకుతున్న వేళ మంత్రి గారు కేటీఆర్ కి ఈ వార్తను వినిపించారు. మరి ఈ రెండు రోజులూ ఎంజాయ్ చేయాలా లేక 3, 4 తేదీలలో జరగబోయేది ఏమిటి అన్నది కేటీఆర్ ఆలోచించుకోవాలా అన్నది అయితే ఆలోచించాల్సిందే అంటున్నారు.
ఇక కేటీఆర్ అరెస్ట్ డిసెంబర్ నెల చివరిలో ఉంటుందని అంతా అనుకున్నారు. అదే నెలలో ఆయన కేసు విషయంలో గవర్నర్ నుంచి అనుమతి కూడా తీసుకున్నారు అని కూడా తెలుసు. అయితే ఈ మధ్యలో సినీ హీరో అల్లు అర్జున్ ఎపిసోడ్ ముందుకు వచ్చింది. అనూహ్యంగా మొత్తం మ్యాటర్ ఈ వైపుగా టర్న్ అయింది. అది సద్దుమణిగే సరికి పాత సంవత్సరం అలా ముగిసిపోతుంది
ఇపుడు చూస్తే కనుక కొత్త ఏడాది వస్తోంది. ఈ ఏడాది అంతా బాగుండాలని బీఆర్ ఎస్ నేతలు వేయి దేవుళ్లను మొక్కుకుంటున్నారు. ఈ కీలక సమయంలో కోమటిరెడ్డి కేటీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు అయితే గులాబీ శిబిరంలో గుబులు రేపేలా ఉన్నాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉంది. తీర్పు వెలువడిన తరువాత ఏ విధంగా ఉంటుంది అన్నది మాత్రం తెలంగాణా రాజకీయాలలో ఉత్కంఠను రేకెత్తించేదిగానే ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ కి ఇది నిజంగా ఎంజాయ్ టైమేనా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతుంది.