మదనపల్లె టీడీపీలో డిష్యుం.. డిష్యుం.. అధిష్ఠానం సీరియస్
ఓ వర్గానికి చెందిన నేతల షాపులను మరో వర్షం నేతలు నిప్పు పెట్టడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె టీడీపీలో విభేదాలు పతాకస్థాయికి చేరాయి. ఇన్నాళ్లు తెరచాటుగా గ్రూపు వార్ నడిస్తే.. తాజాగా కార్యకర్తలు, నేతలు తన్నుకుంటూ రోడ్డెక్కుతున్నారు. ఓ వర్గానికి చెందిన నేతల షాపులను మరో వర్షం నేతలు నిప్పు పెట్టడంతో పంచాయితీ పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. 8 నెలలుగా ఇదే తంతు జరుగుతున్నా, ఇన్నాళ్లు పట్టించుకోని హైకమాండ్ లేటెస్ట్ ఇన్సిడెండ్స్ తో సీరియస్ అవుతోంది.
మదనపల్లె తెలుగుదేశం పార్టీలో విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఎమ్మెల్యే షాజహాన్ భాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం తాతయ్య వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం శ్రీరాం తాతయ్య కార్యాలయంపై కొంతమంది దాడి చేయడంతోపాటు ఆయన అనుచరుల దుకాణాలకు నిప్పుపెట్టి భారీగా ఆస్తి నష్టం చేయడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇరువర్గాల మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తున్నా జిల్లా, రాష్ట్ర పార్టీ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నేతలు బహిరంగంగా దాడులు చేసుకునే పరిస్థితి వరకు వెళ్లింది.
మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహన్ భాషా అనూహ్యంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన నామినేషన్ దాఖలకు కొద్ది రోజులు ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి గాలి వీయడంతో మదనపల్లెలో షాజహన్ కూడా సునాయాశంగా గెలిచారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి ఆయన తమను పట్టించుకోవడం లేదని, ఎక్కువగా ఒకప్పుడు తన అనుచరులుగా పనిచేసిన వైసీపీ వారికే ప్రాధాన్యమిస్తున్నారని టీడీపీలో ఓ వర్గం ఆరోపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరాం తాతయ్యతో ఎమ్మెల్యేకు అసలు పొసగడం లేదు. దీంతో నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయిన పరిస్థితి నెలకొంది.
ఈ సమస్యను చక్కదిద్దడానికి టీడీపీ అధిష్టానం గత సోమవారం రంగంలోకి దిగింది. ఇరువర్గాలతో మాట్లాడి రాజీ కుదర్చాలని, సమన్వయంతో నడుచుకునేలా చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకి బాధ్యతలు అప్పగించింది. మంగళవారం బెంగళూరులో రెండు వర్గాలతో సమావేశానికి జగన్మోహన్ రాజు సమాచారం పంపారు. ఇంతలోనే సోమవారం రాత్రి ఇరువర్గాలు దాడులు చేసుకోవడంతో పరిస్థితులు తన చేతులు దాటిపోయాయని ఆయన అధిష్టానానికి నివేదించారు. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగాల్సివచ్చింది.
మదనపల్లె టీడీపీలో బహునాయకత్వం ఉండటం వల్లే సమస్య జటిలమవుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యేదే తప్పు అని మిగిలిన నాయకులు ఆరోపిస్తుండగా, తాను అందరికీ ప్రాధాన్యమిస్తున్నానని ఎమ్మెల్యే వివరణ ఇస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు వర్క్స్ ఇస్తున్నానని చెబుతున్నారు. ఇలా రెండు వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో కార్యకర్తలలో ఆందోళన వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నియోజవకర్గం పక్కనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం అవమానంగా భావిస్తున్నారు. అయితే ఈ వివాదంలో మంత్రి లోకేశ్ లేదా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే పరిస్థితిలో మార్పు వస్తుందని కార్యకర్తలు సూచిస్తున్నారు. మరి పార్టీ ఇప్పటికైనా స్పందిస్తుందా? లేదా? అనేది చూడాల్సివుంది.