మాస్ మహారాజ్ మల్లన్నకు ఏమైంది..? సోషల్ మీడియా స్టార్ కోసం నెటిజన్ల సెర్చింగ్
మల్లన్న అంతా ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి ఒక్కసారి గమ్మున ఉండిపోయారేంటి? అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఆయన అభిమానులు.
పాలమ్మినా..పూలమ్మినా..కష్టపడ్డా..ఫేమస్ అయినా..ఈ డైలాగ్ వినగానే గుర్తుకు వచ్చే నేత మల్లన్న అలియాస్ మల్లారెడ్డి. రెండు తెలుగు స్టేట్స్‌లో మాస్ ఇమేజ్ ఉన్న బిజినెస్ మన్ కం పొలిటిషియన్ మల్లారెడ్డి. ఆయనేం చేసినా సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. సోషల్ మీడియా కోసమే ఆయన యాక్టవిటీస్ ఉంటాయా? అనిపిస్తుంది. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హడావుడి చేసిన మల్లారెడ్డి ముఖం కొద్దిరోజులుగా కనిపించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ బోర్ ఫీలవుతున్నారు. ఆల్ ఆఫ్ సడెన్‌గా మల్లారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారంటూ ఆరా తీస్తున్నారు.
మల్లన్న అంతా ముద్దుగా పిలుచుకునే మల్లారెడ్డి ఒక్కసారి గమ్మున ఉండిపోయారేంటి? అంటూ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఆయన అభిమానులు. మల్కాజ్‌గిరి ఎంపీగా రాజకీయాల్లో ఆరంగేట్రం చేసినా, బీఆర్ఎస్ మంత్రిగా ఆయన ఇచ్చిన స్పీచులు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఆయన ఇంటర్వ్యూల కోసం మెయిన్ స్ట్రీమ్ మీడియాతోపాటు సోషల్ మీడియా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూసేది. తమ స్క్రీన్ పైన మల్లన్న కనిపిస్తే చాలు ఒక్కసారిగా తమ చానల్స్ ట్రెండింగ్ అయిపోతాయని యూటూబర్లు మల్లన్న చుట్టూ తిరిగేవారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నుంచి మల్లన్న జోరు తగ్గించేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్లారెడ్డి ఆస్తులపై బుల్డోజర్ వెళ్లిన నుంచి మునుపటిలా ఆయనలోని మాస్ లీడర్ బయటకి రావడం లేదంటున్నారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో మల్లారెడ్డికి పెద్దకష్టమే వచ్చి పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గులాబీ పార్టీ హయాంలో కాలేజీ ఫంక్షన్లు, పబ్లిక్‌లో తిరుగుతూ, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనదైన చతురతతో నవ్వులు పూయించేవారు. ఆఖరికి అసెంబ్లీలో ఆయన మాట్లాడినా స్పీకర్, సీఎం సహా అందరు కడుపుబ్బా నవ్వుకునేవారు. ఆయనను తమ స్ట్రెస్ బూస్టర్ గా భావించేవారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి గమ్మత్తుగా మారింది.
ఏమైందో ఏమోగాని కొన్ని రోజులుగా మల్లారెడ్డి నోటి నుంచి మాటలు రావడం లేదు. డైలాగ్స్ పేలడం లేదు. పెద్దగా బయటకు రావడం కూడా లేదు. పొలిటికల్ స్క్రీన్ పై మల్లారెడ్డి కనిపించ ఆయన అభిమానులు బోర్ ఫీలవుతున్నారు. ఒకప్పుడు చిన్నా చితక కార్యక్రమాలకు కూడా హాజరై సందడి చేసే మల్లన్న ఎందుకిలా మారిపోయారనేది చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలకు కూడా మల్లారెడ్డి గైర్హాజరు బీఆర్ఎస్ లోనూ చర్చకు దారితీస్తోంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ప్రోగ్రామ్‌కు వచ్చినా ఇంతకు ముందులా ఆయన మాట్లాడటం లేదని చెబుతున్నారు. మౌనంగా ఉండిపోవడం, లేకపోతే పైపైనే మాట్లాడి బైబై చెప్పేస్తున్నారని అంటున్నారు. మల్లారెడ్డి సందడి లేక పార్టీ కార్యకర్తలలో కూడా హుషారు తగ్గిపోయిందని అంటున్నారు.
అయితే మల్లారెడ్డిలో మార్పునకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. మల్లారెడ్డి మనుమరాలి పెళ్లికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన నుంచి ఈ మార్పు రావడంతో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబును మల్లారెడ్డి కలవడం కూడా ఓ కారణమంటున్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీతో పాటు అల్లుడి విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలను దృష్టిలో పెట్టుకునే ఆయన వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరమైన మాటలు మాట్లాడి ప్రభుత్వం దృష్టిలో పడితే తన వ్యాపారాలకే నష్టమని మల్లన్న ఆందోళనతో ఉన్నట్లు మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా మల్లన్నలో మునుపటి జోరు కనిపించకపోవడం సోషల్ మీడియాలో కూడా ఏదో వెలితి కనిపిస్తోందని ఆయన అభిమానులు అంటున్నారు. సో మల్లారెడ్డి.. ఏం జరిగితే అది జరిగింది.. నువ్వు ఎప్పటిలానే ఉండు అన్నా అంటూ అంతా కోరుతున్నారు.