కొండా కన్నీటి పర్యంతం.. అసలేమైంది?

అంత మాత్రాన నోటికి వచ్చినట్లుగా.. రాయలేనంత వికారంగా చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి

Update: 2024-10-01 04:14 GMT

రాజకీయంగా ప్రత్యర్థులు కావొచ్చు. అంత మాత్రాన నోటికి వచ్చినట్లుగా.. రాయలేనంత వికారంగా చేసే వ్యాఖ్యలు ఇటీవల కాలంలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. అభిమానుల పేరుతో అరాచకం చేస్తున్న వారిపై సంబంధిత రాజకీయ పార్గీలు సైతం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అలాంటిదే కొండా సురేఖ ఉదంతంగా చెప్పుకోవాలి. గడిచిన రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతం మీద ప్రెస్ మీట్ పెట్టిన కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే.. ఈ తరహా వైఖరులను పార్టీలకు అతీతంగా ఖండించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా వ్యవహరిస్తున్న కొండా సురేఖ.. మెదక్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా కొండా సురేఖ అక్కడకు వెళ్లారు. స్థానికంగా ఉన్న చేనేత సమస్యల గురించి వివరించిన మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆమె మెడలో చేనేత మాల వేశారు. ఈ సందర్భంగా తన అక్కకు మాల వేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.

ఈ ఘటనను వక్రీకరించిన బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చెందిన పలువురు.. రాయలేని రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైనంతో మంత్రి కొండా సురేఖ నిద్ర లేని పరిస్థితి. చేనేతలకు చెందిన గౌరవప్రదమైన నూలు మాలపై వికారంగా పోస్టులు పెడుతున్న వైనంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనపై పెడుతున్న తప్పుడు పోస్టులను చూసిన పద్మశాలి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ.. బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లిమరీ దాడి చేసినట్లుగా పేర్కొన్నారు.

అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు కొందరు పిచ్చి పట్టినట్లుగా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నట్లుగా ఆమె మండిపడ్డారు. ఈ అంశంపై మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. ‘ఇదే విధంగా హరీశ్.. కేటీఆర్ ఇంటి ఆడవాళ్లపై మాట్లాడితే ఊరుకుంటారా?’ అని సూటిగా ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సివస్తుందని.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకు మంత్రి పదవే ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.

ఈ ఎపిసోడ్ కు సంబంధించి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ ముఖ్యనేతల్లో ఒకరైన హరీశ్ రావు స్పందించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఈ తరహా పోస్టులను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖకు కలిగిన అసౌకర్యానికి తాను చింతిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించటాన్ని తాము సహించమని.. ఈ విషయంలో బీఆర్ఎస్ అయినా ఉపేక్షించమన్న మాటను సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు. మొత్తంగా ఇష్యూ పెద్దది కాకుండా వెంటనే స్పందించటం ద్వారా.. డ్యామేజ్ కంట్రోల్ పద్దతిని హరీశ్ అనుసరించారని చెప్పాలి.

Tags:    

Similar News