మరో వివాదంలో సురేఖ.. అధిష్టానం ఏం చేయబోతోంది..?

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు.

Update: 2024-10-14 10:31 GMT

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటి కేటీఆర్ ‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సురేఖపై ఇప్పటికే పరువు నష్టం దావా వేశారు. అటు సినీ నటుడు నాగార్జున కుటుంబంపై చేసిన ఆరోపణలపైనా కేసు నమోదు అయింది. నాగార్జున కూడా పరువు నష్టం దావా పిటిషన్ వేశారు. ఇప్పటికే ఈ వివాదంతో సతమతం అవుతున్న సురేఖ.. దసరా పండుగ పూట మరో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు.

ఉమ్మడి వరంగల్ వేదికగా రాజుకున్న ఈ వివాదంతో కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపులు మరోసారి తెరమీదకు వచ్చాయి. కొంత కాలంగా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విభేదాలు నెలకొని ఉన్నాయి. ఈ ఏడాది మేలో వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాజాగా.. పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి పెను దుమారానికి దారితీశాయి.

దసరా పండుగను పురస్కరించుకొని ధర్మారంలో కొండా వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో ప్రకాష్ రెడ్డి ఫొటో లేదు. దాంతో ఆయన వర్గీయులు ఆ ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలు చింపేసిన ప్రకాష్ రెడ్డి వర్గీయులపై కొండా వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఇక అప్పటి నుంచి ఆ వివాదం పెరిగింది. తమపై దాడిచేశారని రేవూరి వర్గీయులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు గీసుకొండ పోలీసులు ముగ్గురు కొండా అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టు చేసిన ఆ ముగ్గురిని వెంటనే విడిచిపెట్టాలంటూ కొండా సురేఖ వర్గీయులు గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు ధర్మారం వద్ద వరంగల్-నర్సంపేట రహదారిపై పెద్ద ఎత్తున ధర్మాకు దిగారు. అక్రమ కేసులు పెట్టి రేవూరి తమను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ ఆకస్మాత్తుగా గీసుకొండ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. కార్యకర్తల అరెస్టుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ ఎపిసోడ్‌లో మంత్రి కొండా సురేఖ కాస్త ఓవరాక్షన్ చేసినట్లుగా ప్రచారం జరిగింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సురేఖ.. ఎస్‌హెచ్ఓ కుర్చీలో కూర్చోవడం కనిపించింది. ఆ కుర్చీలో కూర్చొని పోలీసులను నిలదీస్తున్నట్లుగా వీడియోలు బయటకు వచ్చాయి. ఇది కాస్త మరో దుమారానికి దారితీసింది. దాంతో సురేఖపై మరోసారి విమర్శల ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. తమ అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులను ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయాలంటూ పట్టుబట్టారని సమాచారం. ఆ వెంటనే వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్టేషన్‌కు చేరుకొని మంత్రిని శాంతింపజేశారట.

ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్‌ అయినట్లుగా సమాచారం. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సీటులో కూర్చొని పోలీసులను ప్రశ్నించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే క్రమంలో ఆమెకు అధిష్టానం నుంచి వచ్చిన ఫోన్‌తోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. అందుకే.. కొండా కూడా స్టేషన్‌ నుంచి బయటకు వెళ్లే క్రమంలో ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోయారు. అగ్రనాయకత్వం ఆదేశాలతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మొత్తానికి ఇప్పటికే పరువు నష్టంతోపాటు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సురేఖ.. మరో వివాదంలో చిక్కుకోవడంతో పార్టీ అధిష్టానం ఏమైనా చర్యలకు దిగుతుందా..? అనే చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News