ఇంత దారుణ‌మా 'అమ్మా'..?

అమ్మ అంటేనే ప్రేమ‌కు, ఆప్యాత‌కు ప‌రాకాష్ఠ‌. బిడ్డ‌ల‌ను అమ్మ క‌డుపులో పెట్టుకుని చూస్తుంది

Update: 2024-03-21 08:03 GMT

అమ్మ అంటేనే ప్రేమ‌కు, ఆప్యాత‌కు ప‌రాకాష్ఠ‌. బిడ్డ‌ల‌ను అమ్మ క‌డుపులో పెట్టుకుని చూస్తుంది. కానీ, అమెరికాలో ఓ మ‌హిళ త‌న 16 నెల‌ల ప‌సికందును ఇంట్లోనే వదిలి తాళం పెట్టి వెళ్లిపోయింది. దీంతో ఆ ప‌సికందు ఆక‌లిని తాళ‌లేక క‌న్నుమూసింది. ఈ ఘ‌ట‌న తెలిసిన వారు.. ఇంత దారుణ‌మా అమ్మా! అని క‌న్నీరు పెడుతున్నారు. అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో ఉన్న క్లీవ్ ల్యాండ్ లో క్రిస్టెల్ కాండెలారియో(32) అనే మ‌హిళ నివ‌సిస్తున్నారు.

ఈమెకు 16 నెల‌ల ప‌సికందు జైలిన్ ఉంది. క్రిస్టెల్ కాండెలారియో ఈ బిడ్డ విష‌యంలో తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింది. తాను 10 రోజుల పాటు ప‌నిచేస్తున్న కంపెనీకి సెల‌వులు పెట్టి.. ఎంజాయ్ చేయ‌డానికి వేకేష‌న్‌కు వెళ్లింది. ప‌సికందును ఇంట్లోనే నిర్దాక్షణ్యంగా వ‌దిలేసింది. దీంతో ఆ పాప ఆక‌లికి తాళ‌లేక‌.. త‌న వారు క‌నిపించ‌క‌.. దిగులుతో ఏడ్చి ఏడ్చి.. చివ‌ర‌కు క‌న్ను మూసింది. ఈ విష‌యం వెలుగులోకి రావ‌డంతో పోలీసులు క్రిస్టెలా కాండెలారియోపై కేసు న‌మోదు చేశారు.

క్రిస్టెల్ కాండెలారియోపై క్లీవ్‌ల్యాండ్‌లోని స్టేట్ కోర్ట్‌హౌస్ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. ప‌సికందు జైలిన్‌ది తీవ్రమైన హత్యగా పేర్కొంది. పిల్లలను సంర‌క్షించాల్సిన త‌ల్లి ఇలా నిర్దాక్షిణ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని వ్యాఖ్యానించింది. దీనికి కారణమైన క్రెస్టెలా కాండెలారియోకు జీవిత ఖైదే స‌రైన‌ శిక్ష అని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. క్యాండెలారియో కేసును పర్యవేక్షించిన న్యాయమూర్తి బ్రెండన్ షీహన్‌.. కోర్టులో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ను ``దారుణ‌ ద్రోహం``గా పేర్కొన్నారు.

కాగా, తాను చేసిన నేరానికి కాండేలారియో కోర్టును క్ష‌మాప‌ణ‌లు కోరారు. అంతేకాదు.. తాను చేసింది త‌ప్పేన‌ని, దేవుడి ముందు కూడా ఒప్పుకొన్నాన‌ని కోర్టులోనే విల‌పించారు. తాను డిప్రెషన్ సంబంధిత మానసిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నాన‌ని కాండెలారియో చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. కోర్టు ఆమె చేసిన నేరాన్ని క‌ప్పిపుచ్చ‌లేర‌ని వ్యాఖ్యానిస్తూ.. ఎలాంటి పెరోల్ కూడా లేకుండానే కాండేలారియోకు జీవిత ఖైదు విధించింది.

Tags:    

Similar News