సీఎంను అలా అనేయటం ఏంది కేటీఆర్?

ఫార్ములా ఈ రేస్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-08 04:21 GMT

ఫార్ములా ఈ రేస్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగాడైతే.. తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో లైవ్ డిబేట్ కు రెఢీ కావాలని కేటీఆర్ సవాలు విసిరారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్న కేటీఆర్.. అదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. తాము అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ను ఉద్దేశించిన విమర్శలు చేసినా.. ఆయన్ను ఉద్దేశించి ఏకవచనంలో ఎవరైనా మాట్లాడినా.. ముఖ్యమంత్రికి గౌరవం వద్దా? ఇష్టారాజ్యంగా మాట్లాడతారా? ఇదేం కల్చర్ అంటూ విరుచుకుపడే కేటీఆర్.. తాజాగా తెలంగాణ రాష్ట్ర సీఎంను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఫార్ములా ఈ రేస్ విషయంలో తాను ఏ విచారణ ఎదుర్కోవటానికైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన కేటీఆర్.. ‘‘ఇది ఆరంభం మాత్రమే. అసలు సినిమా ముందుంది’’ అన్న ఆయన.. కాంట్రాక్టర్ మంత్రి పొంగులేటి.. బ్రోకర్ ముఖ్యమంత్రి రేవంత్.. అంటూ పరుష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కొత్తగా మంత్రి అయిన పొంగులేటి ఎగిరెగిరి పడుతున్నాడంటూ చురకలంటించారు. మంత్రి పొంగులేటి ఎవరెవరి భూములు గుంజుకుంటున్నాడో అన్నీ బయటకు వస్తాయని వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్.. ‘‘సీఎం రేవంత్ బ్రోమర్ కాబట్టే.. ఆయనకు అందరూ అవినీతి పరులుగా కన్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పుట్టుకతో వచ్చిన బుద్ది పోవట్లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టమంటే సీఎం రేవంత్ పారిపోయాడన్న కేటీఆర్.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

ఫార్ములా ఈ రేస్ విషయంలో తనపై ఆరోపణల నేపథ్యంలో విచారణ కోసం ఏసీబీ ఎదుట హాజరయ్యే విషయంలో తాను తన లాయర్ల సమక్షంలోనే హాజరవుతానని పేర్కొన్నారు. అయితే.. దీనికి ఏసీబీ ఒప్పుకోకపోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని తాను హైకోర్టును ఆశ్రరయిస్తానని పేర్కొన్నారు. రాజ్యాంగపరంగా చట్టపరంగా రక్షణ కల్పించాలని కోరితే తప్పేంటి? అన్న ఆయన.. ‘‘జనవరి 9న ఏసీబీ.. 16న ఈడీ విచారణకు సహకరిస్తా. రేవంత్ ప్రాధాన్యత ఫార్ములా అయితే.. మా ప్రాధాన్యత ఫార్మర్స్. రైతుభరోసా డైవర్షన్ కోసమే అక్రమ కేసులు పెట్టారు. ఆరు గ్యారంటీలు అమలు చేసేవరకు రేవంత్‌ను వదలిపెట్టేదే లేదు’’ అని వ్యాఖ్యానించారు.

ఇటీవల కాలంలో తనపై విమర్శలు చేస్తున్న మంత్రులపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘మంత్రులు న్యాయమూర్తులు అయిపోయి తీర్పులు చెప్తున్నారు. ఈ కార్ రేసులో అరపైసా కూడా అవినీతి జరగలేదు. ప్రపంచంలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాను’’ అంటూ తన పని తీరుపై వ్యాఖ్యలు చేశారు. తనపై పెట్టిన కేసు అక్రమమని.. రాజకీయ కక్ష సాధింపు కేసుగా ఆయన అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. బీజేపీ.. కాంగ్రెస్ వేర్వేరు కాదని.. ఒక్కటేనంటూ ఆరోపించారు.

కాంగ్రెస్‌కు రక్షణ కవచంగా బీజేపీ పనిచేస్తుందన్న కేటీఆర్.. తనపై నమోదైన కేసుపై కాంగ్రెస్ కంటే బీజేపీ వాళ్లకే తొందర ఎక్కువ కనిపిస్తోందంటూ మండిపడ్డారు. ‘‘ఎలక్ట్రోరల్ బాండ్స్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైసీపీకి కూడా ఇచ్చారు. మంత్రి‌ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి క్విడ్ ప్రోకో అర్థం కూడా తెల్వదు. కొండగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రాఘవా ఇంజనీరింగ్, మెగా ఇంజనీరింగ్ పంచుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ సునకానందం పొందుతున్నారు’’ అంటూ నిప్పులు చెరిగారు.

రాజ్యాంగం కల్పించిన హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నిస్తున్న రేవంత్.. రాజ్యాంగాన్ని గౌరవించి ఏసీబీ విచారణకు వెళితే.. విచారణ చేయలేదన్నారు. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్యాష్ ను కొట్టేసిన వైనంపై కాంగ్రెస్ నేతలు అదేదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకుంటున్నట్లుగా మండిపడ్డారు. హైకోర్టు ఎక్కడా తాను తప్పు చేసినట్లు చెప్పలేదన్నారు. ‘‘కాంగ్రెస్ నేతలు సన్నాసులు.. దొంగలు’’ అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ కేటీఆర్..తనపై నమోదు చేసిన కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.

Tags:    

Similar News