చంద్రబాబు చొక్కాను ఎప్పుడు వదిలేస్తావ్ కేటీఆర్?

చంద్రబాబుకు ఉన్న కొన్ని గుణాలు కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి.

Update: 2024-11-01 04:46 GMT

సుదీర్ఘంగా సాగుతున్న చంద్రబాబు రాజకీయ జీవితాన్ని రెండు భాగాలు చేస్తే.. జైలుకు ముందు చంద్రబాబు, జైలు తర్వాత చంద్రబాబుగా చెప్పాలి. రాజకీయంగా ఆయన్ను ఇలానే చూడాలి. ఎందుకుంటే.. ఆయనలో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించటమే కాదు.. ఆలోచన తీరు మొదలు నడవడిక వరకు అన్నింట్లోనూ విపరీతంగా మారిపోయారు. మొత్తంగా జైలు జీవితం ఆయన్ను సమూలంగా మార్చేసిందని చెప్పాలి. వరుస ఓటుములు కూడా చంద్రబాబులో మార్పును తేలేకపోయాయి. కానీ.. నెలలపాటు జైల్లో ఉన్న ఆయన్ను సరికొత్తగా మార్చేసింది. నిజానికి ఈ పరిణామం చంద్రబాబులోని కొన్ని లోపాల్ని అధిగమించేలా చేయటమే కాదు.. ఆయన ఇమేజ్ ను మరింత పెంచేందుకు దోహదపడేలా చేసిందని చెప్పాలి.

సాధారణంగా రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పటి కంటే.. విపక్షంలో ఉన్నప్పుడే ఇమేజ్ పెరుగుతుంది. అందుకు చంద్రబాబు మినహాయింపుగా కనిపిస్తారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో.. చంద్రబాబు మీద ప్రజలకున్న ఆగ్రహం తగ్గటానికి ఐదేళ్ల వ్యవధి సరిపోలేదు. వైఎస్ మీద ఆయన ఎంత పోరాటం చేసినా.. ఫలించలేదు సరికదా.. అన్ని రివర్సు అయ్యేవి. చంద్రబాబు లోపాల్ని నిలబెట్టి మరీ కడిగేసిన సమయంలో వైఎస్ ఇమేజ్ అంతకంతకూ పెరిగితే.. చంద్రబాబు ఇమేజ్ అంతకంతకూ తగ్గేది. ఈ తరహా వేరియేషన్ మరే రాజకీయ అధినేతలోనూ కనిపించదు.

ఆ లోటును భర్తీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత కం మాజీ మంత్రి కేటీఆర్. చంద్రబాబుకు ఉన్న కొన్ని గుణాలు కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తాయి. చంద్రబాబు ఎంత కావాలనుకున్నా మాస్ లీడర్ కాలేకపోయారు. ఆయన్ను ముఖ్యమంత్రి అనే కన్నా సీఈవోగానే గుర్తించేందుకు ఇష్టపడతారు. ఇమేజ్ కోసం.. రోజువారీ పొలిటికల్ మైలేజీ కోసం చంద్రబాబు పడే తపన అంతా ఇంతా కాదు. ఇలాంటి సుగుణాలన్ని కేటీఆర్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. అందుకే ఆయన్నుచూసినప్పుడు.. ఆయన మాటల్ని జాగ్రత్తగా వింటున్నప్పుడు పొలిటికల్ గా చంద్రబాబు అడగుజాడల్లో నడుస్తున్నట్లుగా కనిపిస్తారు.

జైలుకు ముందు చంద్రబాబు మాటల్లో అర్థ్రత కనిపించదు. కేటీఆర్ లోనూ అలాంటి పరిస్థితి. ఆగ్రహం.. కోపం.. అసహనం.. అన్నీ అరువుకు తెచ్చుకున్నట్లుగా ఉంటాయే తప్పించి సహజసిద్ధంగా కనిపించవు. అందుకే.. పొలిటికల్ యాంగిల్ లో కేటీఆర్ ను చూసినప్పుడు చంద్రబాబుకు జూనియర్ అన్నట్లుగా కనిపిస్తారు. ఈ విషయాల్ని కేటీఆర్ గుర్తించారో లేదో తెలీదు. కానీ.. ఆయన వీలైనంత త్వరగా చంద్రబాబు చొక్కాను వదిలేసి.. తన తండ్రి మాదిరి తనదైన ఇమేజ్ కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News