ఏక్ నాథ్ షిండేలు ఎక్కడో లేరు కాంగ్రెస్ లోనే ఉన్నారు?
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మన ఓటమికి కారణాలు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయ్యాం
ఏక్ నాథ్ షిండేలు ఎక్కడో లేరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. వారే ఆ ప్రభుత్వాన్ని కూల్చుతారని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలే కాంగ్రెస్ పార్టీని నట్టేట ముంచుతారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి మాటలతో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని దుయ్యబట్టారు. త్వరలోనే వారి పాపం పండుతుంని తెలిపారు.
కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మన ఓటమికి కారణాలు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయ్యాం. అందుకే ఓటర్లు మనకు ఓటు వేయలేదు. అంతేకాని మన పాలనలో ఎలాంటి పొరపాట్లు లేవని అన్నారు. మన అధినేత కేసీఆర్ చేపట్టిన పథకాలు నూటికి నూరు శాతం ఫలితాలు ఇచ్చాయి. కానీ వాటిని మనం సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవంగా నోటిఫికేషన్లు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హామీలకు ప్రజలు మోసపోయారు. రుణమాఫీ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వకపోవడం మనం చేసిన తప్పిదమేనన్నారు. అప్పుడు చేసిన పొరపాట్లు ఇప్పుడు చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు.
నల్గొండ జిల్లాలో 2018లో 11 అసెంబ్లీ సీట్లు గెలిచినా 2023లో మాత్రం వెనకబడిపోయాం. ఇప్పుడు అదే తప్పు జరగకుండా చూడాలి. లోక్ సభ ఎన్నికల్లో మన ప్రభావం చూపించాలి. రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో మన పొరపాట్లు సరిచేసుకుని ముందుకు వెళదాం. పార్టీని విజయతీరాలకు చేర్చుదామని కార్యకర్తలకు భరోసా కల్పించారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీని ముందుకు తీసుకెళదాం. ఓటింగ్ శాతం పెంచుకుని మన తడాఖా చూపించాలి. బీజేపీ, కాంగ్రెస్ లకు సీట్లు రాకుండా చేయాలి. అప్పుడే మన పార్టీ మనుగడ నిలబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన పరువును ఇప్పుడు నిలబెట్టుకుందాం. మనకు ఎదురే లేదని చాటుదాం. మంచి నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళదామని చెప్పారు.