ఫోన్‌ ట్యాపింగ్‌.. కీలక టెస్టుకు కేటీఆర్‌ సిద్ధమేనా?

ఇక హరీశ్‌ రావు మరో అడుగు ముందుకేసి కేటీఆర్‌ లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మరి రేవంత్‌ కూడా లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.

Update: 2024-04-18 04:57 GMT

గత కొద్ది రోజులుగా తెలంగాణా రాజకీయాలు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో తెలంగాణలో నాటి ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నేతలు, సినిమా తారలు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్‌ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తన ఫోన్‌ ను కూడా ట్యాప్‌ చేశారని తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళి సై ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి పలువురు పోలీసు అధికారులు అరెస్టు కూడా అయ్యారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌ లదే ప్రధాన పాత్ర అని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరూ దోషులుగా తేలితే జైలుకు పంపుతామని ఇప్పటికే రేవంత్‌ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ ప్రధానంగా రేవంత్‌ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేశారని అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసింది.

మరోవైపు తనకు ఏ పాపం తెలియదని కేటీఆర్‌ చెబుతున్నారు. ఎవరో ఒకరిద్దరి ఫోన్లను ట్యాప్‌ చేశారేమో తనకు తెలియదంటున్నారు. ఇక హరీశ్‌ రావు మరో అడుగు ముందుకేసి కేటీఆర్‌ లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమని సవాల్‌ విసిరారు. మరి రేవంత్‌ కూడా లైడిటెక్టర్‌ టెస్టుకు సిద్ధమేనా అని ప్రశ్నించారు.

కేటీఆర్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని హరీశ్‌ రావు మండిపడుతున్నారు. ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై కేటీఆర్‌ లై డిటెక్టర్‌ పరీక్షకు సిద్ధమని స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తును పర్యవేక్షిస్తారన్న నమ్మకం ఉంటే రేవంత్‌ కూడా ఇదే పరీక్షకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

అయితే ఇప్పటికే అరెస్టు అయిన పోలీసు అధికారులు ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ తాము ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్టు అంగీకరించినట్టు తెలుస్తోంది. కేసీఆర్‌ ప్రభుత్వంలోని ఒక పెద్ద నేత, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి చెబితేనే తాము ట్యాపింగ్‌ కు పాల్పడ్డట్టు వెల్లడించారని వార్తలు వచ్చాయి.

ఇంత జరుగుతున్నా హరీశ్‌ రావు మాత్రం సవాళ్లు విసురుతుండటంపై సెటైర్లు పడుతున్నాయి. ఫోన్‌ ట్యాపింగ్‌ కు సంబంధించిన ఆధారాలను మూసీ నది వద్దకు తీసుకెళ్లి హార్డ్‌ డిస్కులను, కంప్యూటర్లను నాశనం చేశారని తేలింది. ఇన్ని ఆధారాలు బయటపడుతున్నా హరీశ్‌ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News