కేటీయార్ వైరాగ్యం పీక్స్ కి...!

కేటీయార్ వైరాగ్యం పీక్స్ కి...!

Update: 2024-01-17 04:45 GMT

కేటీఆర్ సన్ ఆఫ్ కేసీఆర్.అంతేనా కానే కాదు కేటీఆర్ బీఆర్ఎస్ కి కీలకం, దాదాపుగా పదేళ్ల పాటు తెలంగాణాలో సాగిన గులాబీ పార్టీ ప్రభుత్వానికి అన్నీ ఆయనే అయ్యారు. ఒక విధంగా ఫుల్ పవర్స్ తో అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని నడిపించారు. అయితే అనూహ్యంగా ఓటమి వరించింది. దాంతో కేటీఆర్ ఒక్కసారిగా మారిపోయారు.

ఆయన నోటి వెంట వేదాంతం అలా తన్నుకుని వస్తోంది. కేటీఆర్ ఇటీవల కాలంలో ఏమి మాట్లాడినా వైరాగ్యమే అందులో కనిపిస్తోంది. లేటెస్ట్ గా కేటీఆర్ ఆణిముత్యాల లాంటి మాటలను బీఆర్ఎస్ క్యాడర్ కి చెప్పుకొచ్చారు. అదేంటి అంటే పదవులు వస్తాయి పోతాయి పదవులు శాశ్వతం కాదు అని. నిజమే కదా ఇవి కదా అండర్ లైన్ చేసుకుని మరీ పదే పదే రాజకీయ నేతలు చెప్పుకోవాల్సింది.

అంతే కాదు మరో మంచి మాట కూడా కేటీఆర్ అన్నారు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని. సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్‌లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా కేంద్రంలో సర్పంచ్‌ల ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ పదవుల గురించి అలా తన మనసులో మాటలను చెప్పేశారు. పదవులు వస్తాయి పోతాయి అంటూ ఇటీవల బీఆర్ ఎస్ కి తగిలిన భారీ ఓటమిని మరచిపోయే ప్రయత్నం చేసారు.

తనను తాను ఓదార్చుకుంటూ క్యాడర్ ని కూడా ఉత్సాహపరచారు అన్న మాట. అదే విధంగా లైఫ్ గురించి కూడా కొన్ని మాటలు చెప్పారు. జీవితంలో, రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సహజమన్నారు. గోడకు తగిలిన రబ్బర్ అదే తరహాలో మళ్లీ తప్పకుండా తిరిగి వస్తామన్నారు. మొత్తానికి చూస్తే కేటీఆర్ లో ఈ ఆశావహ దృక్పధానికి మాత్రం హాట్సాఫ్ అనాల్సిందే.

ఎందుకంటే నేతాశ్రీలు ఓడిపోతే మాత్రం ప్రపంచం తల్లకిందులు అయింది అని భావిస్తారు. కానీ కేటీఆర్ మాత్రం వేదాంతాన్ని వల్లిస్తూ అందులోనే శాంతిని చూసుకుంటున్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని క్యాడర్ కి ధైర్యం నూరిపోస్తున్నారు.

అయితే కేటీఆర్ మాటలు అన్నీ మరో రెండు మూడు నెలలలో జరిగే ఎంపీ సీట్ల మీద ప్రభావం చూపించి బీఆర్ ఎస్ ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకుంటే ఓకే. లేకపోతే మాత్రం అపుడు ఈ రాజకీయ వేదాంతం మరో అయిదేళ్లకు సరిపడా దగ్గరలో ఉంచుకుని టన్నుల కొద్దీ ధైర్యం తెచ్చుకోవాల్సిందే అని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

Tags:    

Similar News