దీక్ష పూర్తి.. ప్రయాగ్ రాజ్ ను వీడనున్న 10 లక్షల మంది!

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేర్కొంటున్న మహాకుంభమేళా చివరకు వచ్చేస్తోంది.

Update: 2025-02-13 04:23 GMT

ప్రపంచంలోనే అతి పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేర్కొంటున్న మహాకుంభమేళా చివరకు వచ్చేస్తోంది. నిత్యం లక్షలాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తునన ఈ కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. బుధవారం నాటికి ప్రయాగ్ రాజ్ కు విచ్చేసిన భక్తులు 46.25 కోట్ల మందిగా చెబుతున్నారు. బుధవారం మరో విశేషమైన రోజు కావటంతో భారీ ఎత్తున భక్తులు రావటం.. ఒక్కరోజులో 2 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. మహాకుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజుల్లో ఒకటైన మాఘ పూర్ణిమ వేళ భక్తులు పోటెత్తారు.

ఇదిలా ఉండగా.. మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్ కు వచ్చి.. గడిచిన నెల రోజులుగా అక్కడే ఉంటూ దీక్ష చేపట్టిన పదిలక్షల మంది తమ కల్పవాసీ దీక్షను ముగించారు.దీంతో.. వీరంతా ఒక్కసారిగా ప్రయాగ్ రాజ్ ను వీడనున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయన్న ఆందోళన పోలీసుల్లో ఉంది. అందరూ ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని..పార్కింగ్ స్థలాల్ని మాత్రమే వినియోగించాలనంటూ అధికారులు కల్పవాసీలకు విన్నవించుకుంటున్నారు.

మరోవైపు ప్రత్యేక రోజు కావటంతో హెలికాఫ్టర్ నుంచి భక్తుల మీద పూలవర్షం కురిపించారు అధికార వర్గాలు. యూపీ రాజధాని లక్నోలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన వార్ రూం నుంచి సీఎం యోగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు డీజీపీ.. రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు సీఎం కార్యాలయంలోనే ఉన్నారు. పలువురు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది.

జనవరి 13న మొదలైన ఈ మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు హాజరు కావటం తెలిసిందే. ఈ భారీకార్యక్రమానికి తగ్గట్లే యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేపట్టింది. ఇక్కడ ఏర్పాటు చేసిన సెంట్రల్ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 12 మంది గర్భిణీలు డెలివరీ కావటం ఒక ఎత్తు అయితే.. అవన్నీ నార్మల్ డెలివరీలే కావటం మరో ఆసక్తికర అంశంగా చెబుతుననారు. వీరిలో యూపీ.. మధ్యప్రదేశల్.. రాజస్థాన్.. జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

పుట్టిన పిల్లల్లో ఆడపిల్లలకు బసంతి.. గంగ.. జమున.. బసంత్ పంచమి.. సరస్వతి పేర్లు పెట్టగా.. మగపిల్లలకు కుంభ్.. భోలేనాథ్.. బజ్ రంగీ.. నంది పేర్లను పెట్టుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ నెల16న ముగిసే ఈ మహాకుంభమేళాకు అంతకంతకూ భక్తుల రద్దీ ఎక్కువ అవుతోంది. ముగింపు వేళకు రికార్డు స్థాయిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెబుతున్నారు.

Tags:    

Similar News