జగన్ ను బుజ్జగిస్తున్న కూటమి సర్కారు..!
రెండు సార్లలోనూ తొలిరోజు మాత్రమే జగన్ హాజరయ్యారు. తర్వాత.. రోజులు ఆయన డుమ్మా కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
నేను అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని! అని ఎన్నికల సమయంలో ఊరూవాడా ప్రచారం చేసిన జగన్.. ఎన్నికల్లో కూటమి ఎఫెక్ట్‌తో ఓడిపోయి ఉండొచ్చు. కానీ.. రాజకీయంగా ఆయన ఇప్పుడు అసలు స్వరూపం ఏంటనేది చూస్తే.. అభిమన్యుడు కాదనే విషయం వెలుగు చూస్తోంది. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలు రెండు సార్లు జరిగాయి. రెండు సార్లలోనూ తొలిరోజు మాత్రమే జగన్ హాజరయ్యారు. తర్వాత.. రోజులు ఆయన డుమ్మా కొట్టారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయితే.. ఇక్కడే ఒక లాజిక్కును జగన్ చెప్పుకొచ్చారు. తను వెళ్లినా.. మైకు ఇవ్వరని, తను ప్రజాసమస్య లు ప్రస్తావించాలని భావిస్తున్నానని.. అందుకే తనకు మైకు ఇచ్చే ఉద్దేశం వారికి లేదని ఆయన చెప్పారు. ఇది పెద్ద ఎత్తున ప్రజల మద్యకు వెళ్లింది. అయితే.. అసలు సభకు వెళ్లకుండానే ఇలా విమర్శలు చేయడం ఎందుకనే చర్చ కూడా వచ్చింది. కానీ, ఇది సర్కారుకు సెగ పెట్టింది. దీంతో మంత్రుల నుంచి స్పీకర్ అయ్యన్న వరకు కూడా .. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వైసీపీని బుజ్జగిస్తున్నారు.
సభకు వైసీపీ నాయకులు రావాలి. వారికి సమయం ఇస్తాం. వారు మాట్లాడేందుకు మైకు ఇచ్చే బాధ్యత నాది. సభలో సభ్యుల సంఖ్య ఆధారంగా ఖచ్చితంగా మైకు ఇస్తాను. ఈ విషయంలో నేను బాధ్యత తీసుకుంటా- అని తాజాగా స్పీకర్ అయ్యన్న చెప్పారంటే..జగన్ అర్జునుడిగా విజయం దక్కించుకున్నట్టేగా! ఇదేసమయంలో పలువురు మంత్రులు కూడా.. జగన్ సభకు వస్తే మైకు ఇస్తామని.. మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఇది జగన్ సాధించిన తొలి విజయం.
ఇక, సర్కారు కూడా.. ఈ విషయంలో పునరాలోచనలో పడింది. ఇటీవల అసెంబ్లీలో ఆర్థిక శాఖపై శ్వేత పత్రం విడుదల చేసి.. సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇదేసమయంలో జగన్ మీడియా సమావేశం పెట్టి.. తను చెప్పాలనుకున్నది చెప్పారు. అయితే.. ఈ రెండు విషయాలను ప్రధాన మీడియా ప్రసారం చేసింది. కానీ, సభను ఆన్లైన్‌లో చూసినవారు.. 50 వేలపైచిలుకు ఉంటే.. జగన్ మీడియా సమావేశాన్ని 7 లక్షల పైగా చూశారు.
దీనిపైనా ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఇదే కంటిన్యూ అయితే.. సభను చూసే వారు తగ్గిపోగా.. తమపై వ్యతిరేక ప్రభావం పడుతుందని కూడా ఆలోచిస్తోంది. దీంతో మార్పు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్పీకర్ స్పందించడం గమనార్హం. సో.. ఇక్కడ కూడా..జగన్ అర్జునుడిగానే బయట పడ్డారని అంటున్నారు.