తాజా సర్వే... రాహుల్ కి ఒకేసారి గుడ్ - బ్యాడ్ న్యూస్!

ఇందులో భాగంగా విడుదలైన ఫలితాల ప్రకారం.. విపక్షాల కూటమి "ఇండియా" ఎన్డీయే కూటమిని మట్టికరిపించలేదని సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు తెలిపారని తెలుస్తోంది.

Update: 2023-08-25 05:22 GMT

త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటం.. ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికలు పూర్తవ్వడం.. మరోపక్క విపక్షాలు బలమైన కూటమి "ఇండియా"గా మారడం తెలిసిందే. మరోపక్క ఎన్డీయే దూకుడు పెంచిందని చెబుతున్నారు. మరోపక్క మణిపూర్ మచ్చ అలానే ఉంది. ఈ సమయంలో ఒక సర్వే తెరపైకి వచ్చింది.

అవును... ఎన్డీఏ - ఇండియా లలో ఏ కూటమికి ప్రజల మద్దతు ఉంది. రాబోయే రోజుల్లో ఏ కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే విషయాలపై తాజాగా మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ ప్రముఖ జాతీయ న్యూస్ ఛానెల్ ఇండియా టుడే - సీఓటర్ సంయుక్తంగా సర్వే నిర్వహించాయి.

ఈ సర్వే ఫలితాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో భాగంగా విడుదలైన ఫలితాల ప్రకారం.. విపక్షాల కూటమి "ఇండియా" ఎన్డీయే కూటమిని మట్టికరిపించలేదని సర్వేలో పాల్గొన్న మెజార్టీ ప్రజలు తెలిపారని తెలుస్తోంది.

ఇందులో భాగంగా... సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది విపక్షాల కూటమి "ఇండియా" ఎన్డీయే కూటమిని మట్టికరిపించలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 33 శాతం మంది కచ్చితంగా విపక్షాల కూటమే నెగ్గుతుందని చెప్పారు. మిగిలినవారు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు.

ఇదే సమయంలో "ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్" అని అర్థం వచ్చేలా ఏర్పాటైన విపక్షాల కూటమి "ఇండియా" అనే పేరుతో ఓట్లను రాబట్టగలదా అనే ప్రశ్నకు 39శాతం అనుకూలంగా సమాధానమివ్వగా.. 30శాతం మంది అలాంటి సెంటిమెంట్స్ వర్కవుట్ అవ్వవన్నట్లుగా సమాధానం ఇచ్చారు!

ఇదే క్రమంలో... ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి ఎవరు సరిగ్గా సరిపోతారనే విషయంపై కూడా ఈ సంస్థ సర్వే చేపట్టింది. ఈ ప్రశ్నకు 24 శాతం మంది కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొనగా... పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్లను 15 శాతం మంది ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయం సర్వేలో మారుతూ వస్తోంది. ఇందులో భాగంగా... మోడీకి కాస్త తగ్గగా... రాహుల్ గాంధీకి అనుకూలంగా మద్దతు క్రమంగా పెరుగుతోంది. అయితే అది ఎన్డీయే ను మట్టికరిపించేంత మాత్రం ప్రస్తుతానికి కాదని తెలుస్తోంది.

కాగా... త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ఎన్డీఏ, ఇండియా కూటములు సెమీ ఫైనల్స్ గా భావిస్తూ, తదనుగుణంగా వ్యూహాలు రచిస్తోన్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News