ఇంకో చోట మంట పుట్టింది... 300 మంది గులాబీ నేతల సీక్రెట్ మీటింగ్
ఇలాంటి సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా సదరు నియోజకవర్గంలోని 300 మంది నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు.
తెలంగాణలో నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందన్నట్లుగా పరిణామాలు మారుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటనకు రానుందనే వార్తలు ఇందుకు నిదర్శనం. ఈసీ బృందం మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి రాజకీయ పార్టీలతో అధికారులతో సమావేశం కానుంది. ఇలాంటి సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగింది. ఓ ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా సదరు నియోజకవర్గంలోని 300 మంది నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. అలా టార్గెట్ అయింది పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు.
సిటింగ్‌లకు, గతంలో పోటీ చేసిన నేతలకే రాబోయే ఎన్నికల్లో టికెట్లు అనే ఇటీవలే గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి భరోసా పొందిన వారిలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఒకరు. అయితే, నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు మాత్రం పుట్ట మధుకు టికెట్ విషయంలో గుస్సా అయ్యారు. ఈ అంతర్గత అసంతృప్తి కాస్తా రహస్య సమావేశం వరకూ చేరింది. తాజాగా పుట్టమధుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నేతలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. తొమ్మిది మండలాలకు సంబంధించిన 300 మంది నాయకులు సమావేశం అయినట్లు వార్తలు రావడం కలకలం రేకెత్తిస్తోంది.
హైదరాబాద్ నగర శివార్లలో ఓ ప్రాంతంలో రహస్యంగా సమావేశమైన నేతలు పుట్ట మధుకు వ్యతిరేకంగా కీలక ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ రహస్య సమావేశంంలో పుట్ట మధు అభ్యర్థిత్వంపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచించుకోవాలని చర్చించినట్లు తెలిసింది. మంథనిలో అరాచకాలు, రౌడీయిజం రూపుమాపే విధంగా ప్రజల్లో గుణాత్మక మార్పు తేవాలని, ప్రజా ఉద్యమాలు చేసి పుట్ట మధు లాంటి వారికి టికెట్ రాకుండా చేయాలని చర్చించినట్లు సమాచారం. కాగా, ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న సమయంలో ఇలా సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యే అభ్యర్థికి వ్యతిరేకంగా రహస్య సమావేశం అవడం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.