నేతలకు సంఘాల బెడద.. అయినా తప్పదు మరి!
కార్తీక సమారాధనల పేరుతో కుల సంఘాలు కార్యక్రమాలు చేసుకోవడమే. ఒక్కొక్క సంఘం రెండు మూడు రోజుల పాటు.. కార్తీక భోజనాలు ఏర్పాటు చేయాలని నాయకులను కోరుతున్నాయి.
అసలే ఎన్నికల కాలం. ఎవరిని ఏమన్నా.. ఓటు బ్యాంకుపై ప్రభావం పడిపోవడం ఖాయం. మరోవైపు ఇదే అవకాశంగా ప్రత్యర్థులు కాచుకుని కూర్చున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక.. నాయకులు సతమతం అవుతున్నారు. దీనికి కారణం.. కార్తీక సమారాధనల పేరుతో కుల సంఘాలు కార్యక్రమాలు చేసుకోవడమే. ఒక్కొక్క సంఘం రెండు మూడు రోజుల పాటు.. కార్తీక భోజనాలు ఏర్పాటు చేయాలని నాయకులను కోరుతున్నాయి.
ఎన్నికలకు మరో 9 రోజుల గడువు ఉండడం.. పైగా కార్తీక మాసం కావడంతో ఎవరినీ కాదనలేక .. నాయకు లు సర్దుకు పోతున్నారు. అయితే.. కుల సంఘాలు ఏకమైతే నాయకులకే మంచిది కదా! అనే మాట లేక పోలేదు. కానీ.. ఇక్కడ సమస్యంతా.. డబ్బుతోనే ఉందని చెబుతున్నారు. ఒక్కొక్క సంఘం తక్కువలో తక్కువగా 10 లక్షలు అడుగుతోంది. ఇలా.. రెండు రోజులకోసారి నాలుగైదు కులసంఘాలకు ఏర్పాటు చేయడం అంటే.. మాటలు కాదుగా! అని నాయకులు చెబుతున్నారు.
"పెద్ద నియోజకవర్గం అయితే.. నాకూ ఇబ్బంది లేదు. మనది చిన్న నియోజకవర్గం. ఇక్కడ పారిశ్రామికం గా పెద్ద రాబడిలేదు. ఓ ఐదు వరకు సర్దుతా" అని ఓ కీలక ఎమ్మెల్యే చెప్పిన విషయం బీఆర్ ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ, ఇదే కీలక సమయమని.. ఎంతైనా ఖర్చు పెట్టాలని పార్టీ అధిష్టానం నుంచి కబురు వస్తోంది. కానీ, సొమ్ము పంపేందుకు చానెళ్లు లేకుండా పోయాయి. దీంతో తర్వాత చూసుకుందాం .. ముందు మీరు ఇవ్వండి అనే ధరోణిలో ఆదేశాలు వస్తున్నాయట.
ఇక, కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే తరహా ప్రచారం జరుగుతోంది. కుల సంఘాల కార్తీక సమారాధానలకు డబ్బు లు సర్దుబాటు చేసేందుకు కొందరు నాయకులు అప్పులు చేయాల్సి వస్తోందని పార్టీలో చర్చ సాగుతోం ది. సాధారణంగా కార్తీక భోజనాలు అంటే.. ఆదివారం జరుగుతాయని, కానీ, ఎన్నికలు కావడంతో వారంతో పనిలేకుండానే సంఘాలు రెడీ అవుతున్నాయని మరో చర్చసాగుతోంది. ఇదలావుంటే, బీజేపీలో కొందరు నాయకులు వన భోజనాలకు స్వయంగా ఆహ్వానాలు అందిస్తున్నారు. మొత్తంగా .. నేతలకు సంఘాల నుంచి బెడద ఎక్కువగానే ఉండడం గమనార్హం.