వారం తేడాలో.. అటు ఎన్నికలు.. ఇటు ఐపీఎల్.. క్లైమాక్స్ కు..
అత్యంత శక్తిమంతమైన భారత భావి ప్రధాని ఎవరో నిర్ణయించే ఎన్నికలు దేశంలో ఏడు దశల్లో తలపెట్టారు
150 కోట్ల భారత దేశంలో మూడు రంగాల ప్రజలే అత్యంత పాపులర్.
అవి క్రికెట్, సినిమా, రాజకీయాలు. వీటిలోనూ ఏడాదికోసారి జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల సందర్భంగా ఉండే సందడే వేరు. కాగా, ఐదేళ్లలో ఒక సందర్భంలో మాత్రం ఐపీఎల్-ఎన్నికలు ఢీకొంటాయి. ఇలా 2009, 2014, 2019లో జరిగింది. ఆయా సందర్భాల్లో ప్రత్యామ్నాయాలు చేశారు గానీ.. లీగ్ ను మాత్ర నిరాటంకంగా కొనసాగించారు. ఇక ఈ సారి కూడా సార్వత్రిక ఎన్నికలు, ఐపీఎల్ ఢీకొన్నాయి. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో లీగ్ లో కొంత భాగాన్ని వేరే దేశంలో నిర్వహిస్తారనే కథనాలు వచ్చినా అదేమీ జరగలేదు. పూర్తిస్థాయిలో భారత్ ఆతిథ్యం ఇస్తోంది.
ఎన్నికల్లో 7కు గాను 4
అత్యంత శక్తిమంతమైన భారత భావి ప్రధాని ఎవరో నిర్ణయించే ఎన్నికలు దేశంలో ఏడు దశల్లో తలపెట్టారు. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో సహా నాలుగు దశలు పూర్తయ్యాయి. 380 పైగా సీట్లలో పోలింగ్ అయిపోయింది. మిగిలిన 150కు కొద్దిగా అటుఇటు మాత్రమే. అంటే.. మెజారిటీ ప్రజలు తమ నిర్ణయం ఏమిటో చెప్పేశారు. ఆ ఫలితం ఈవీఎంలో నిక్షిప్తం అయి ఉంది. మిగిలిన పావు వంతు సీట్లలో పోలింగ్ ఈ నెల 20, 25, జూన్ 1న జరగనుంది.
74కు 67
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో లీగ్ దశలో 70 మ్యాచ్ లకు గాను 67 పూర్తయ్యాయి. ఆ తర్వాత ప్లేఆఫ్స్. ఇవి మూడు మ్యాచ్ లు. అనంతరం ఫైనల్. దీంతో 74 మ్యాచ్ ల లీగ్ పూర్తవుతుంది. ఫైనల్ ఈ నెల 26న జరగనుంది. 17వ సీజన్ విజేత ఎవరో తేలాలంటే మరొక్క పదిరోజులు అన్నమాట. కాగా, ముంబయి - లఖ్‌నవూ మధ్య వాంఖడేలో శుక్రవారం మ్యాచ్ జరగనుంది. దీంట్లో ఎవరు గెలిచినా ‘ప్లే ఆఫ్స్’పై ప్రభావం ఉండదు. అయితే, శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న బెంగళూరు-చెన్నై మ్యాచ్ మాత్రం కీలకమే. ఇప్పటికే కోల్ కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరాయి. చెన్నై, బెంగళూరు మధ్య నాలుగో బెర్తు తేలాల్సి ఉంది.
వరుణుడే డిసైడర్..
బెంగళూరు, చెన్నై మ్యాచ్ కూ వర్షం ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అదే జరిగితే బెంగళూరుకు సొంతగడ్డపై చేదు అనుభవం. మ్యాచ్ రద్దైతే చెన్నై (15 పాయింట్లతో) ప్లేఆఫ్స్ చేరుతుంది. బెంగళూరు 13 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. అలాకాకుండా మ్యాచ్ పూర్తిగా జరిగితే బెంగళూరు నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుంటూ చెన్నైపై నెగ్గాలి.
కొసమెరుపు: వారం తేడాలో.. మార్చి 16న దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలైంది. కానీ, ముందుంగా మే 26న ఐపీఎల్ ఫలితం రాబోతోంది. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వస్తాయి.