ముగ్గురు కేంద్ర మంత్రులు.. ఏడుగురు ఎంపీలు.. మధ్యప్రదేశ్ బీజేపీకి డౌటే?

కేంద్ర మంత్రులను బరిలో దింపి కీలక రాష్ట్రం కావడంతో వచ్చే ఎన్నికలకు బీజేపీ ఏకంగా ఏడుగురు సిటింగ్ ఎంపీల (వీరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు)ను బరిలో దింపుతోంది.

Update: 2023-09-26 07:31 GMT

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యంత వివాదాస్పదమైన రాష్ట్రం కర్ణాటక.. దొడ్డిదారిన అధికారం.. పే సీఎం ఆరోపణలు.. ముఖ్యమంత్రి మార్పు.. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు.. మతపరమైన వివాదాలు.. ఇలా ఎన్నో అంశాల్లో బీజేపీ ప్రభుత్వం అప్రదిష్ఠపాలైంది. దీంతో కర్ణాటకను మే నెలలో జరిగిన ఎన్నికల్లో పళ్లెంలో పెట్టి కాంగ్రెస్ పార్టీకి అప్పగించింది. దక్షిణాదిలో జెండా ఎగురవేస్తామని చెబుతున్న ఆ పార్టీకి ఇది పెద్ద దెబ్బ అనడంలో సందేహం లేదు. అచ్చం కర్ణాటకలాగే మరో రాష్ట్రంలోనూ బీజీపీకి, అక్కడి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. అదే రాష్ట్రమంటే..

కాషాయ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. వాస్తవానికి బీజేపీ ఇక్కడ నేరుగా అధికారంలోకి రాలేదు. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ మెజార్టీతో గెలిచింది. కమల్ నాథ్ సీఎం అయ్యారు. కానీ యువ నేత జ్యోతిరాదిత్య సింథియాకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

దీనిని సాకుగా తీసుకుని జ్యోతిరాదిత్యకు బీజేపీ వల వేసింది. తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరిన జ్యోతిరాద్యితకు తదనంతరం కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది. మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కారును కూల్చిన బీజేపీ శివరాజ్ సింగ్ చౌహాన్ ను మళ్లీ సీఎం చేసింది.

అనేక ఆరోపణలు..పాలనా వైఫల్యాలతో మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. విమర్శలు అలా ఉంచితే.. ఇటీవల వేధింపులకు గురైన గిరిజనుడిని నేరుగా సీఎం పిలిచి కాళ్లు కడగడం.. చివరకు అతడు బాధితుడు కానే కాదని తేలడం నామోషీగా మారింది. మరోసారి ఉద్యోగ నియామకాల కుంభకోణం బయటకు వచ్చింది. ఇంకా అనేక వైఫల్యాలు బీజేపీ సర్కారును వెంటాడుతున్నాయి. కాగా, వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ గెలవడం కష్టమేననే అంచనాలున్నాయి. దీంతోనే ఆ పార్టీ అనేక వ్యూహాలు పన్నుతోంది.

కేంద్ర మంత్రులను బరిలో దింపి కీలక రాష్ట్రం కావడంతో వచ్చే ఎన్నికలకు బీజేపీ ఏకంగా ఏడుగురు సిటింగ్ ఎంపీల (వీరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు)ను బరిలో దింపుతోంది. వీరి పోటీ ప్రభావం పక్క నియోజకవర్గాలపైనా ఉంటుందని.. తద్వారా పొరుగున ఉండే, బలహీనంగా ఉన్న స్థానాల్లో వ్యతిరేకతను అధిగమించవచ్చని భావిస్తోంది.

సీఎంకు సీటే లేదు..దొడ్డిదారిన అధికారంలోకి వచ్చినా, నేరుగా గెలిచినా మధ్యప్రదేశ్ లో బీజేపీకి అన్నీ సీఎం శివరాజ్ చౌహానే. పార్టీ తరఫున అత్యంత ఎక్కువ కాలం సీఎంగా ఉన్న చౌహాన్ కు గత నెలలో ప్రకటించిన తొలి, సోమవారం నాటి మలి జాబితాలో శివరాజ్ కు సీటే ఇవ్వలేదు. అంటే సీఎం పదవి రేసును పార్టీనే ముందుపెట్టి నాయకులను గెలుపు కోసం ఊరిస్తోంది. కేంద్ర మంత్రులు నరేంద్ర తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్థేలతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయనూ మధ్యప్రదేశ్ బరిలో దింపుతోండడం గమనార్హం. వీరిలో తోమర్ రెండు దశాబ్దాల తర్వాత, విజయ వర్గీయ దశాబ్దం అనంతరం అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

Tags:    

Similar News