ఏపీలో మళ్లీ జగన్‌ ప్రభుత్వమే: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హాట్‌ కామెంట్స్‌!

ఈ నేపథ్యంలో తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో మళ్లీ జగన్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు.

Update: 2024-04-04 05:38 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ లో మళ్లీ జగన్‌ ప్రభుత్వమే వస్తుందన్నారు. టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేసిందన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఎదగనీయదని స్పష్టం చేశారు.

చంద్రబాబు పని అయిపోయిందని.. బీజేపీతో పొత్తు పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశారన్నారు. జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాత కాలంలో మనుగడ సాగించిన దాఖలాలు లేవన్నారు. పొత్తు తర్వాత తమతో జతగూడిన పార్టీలను జాతీయ పార్టీలు మింగేస్తాయని గోపీనాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను టీడీపీని వదిలి టీడీపీలో చేరడానికి కారణాలున్నాయని గోపీనాథ్‌ వెల్లడించారు. టీడీపీని తెలంగాణలో చంద్రబాబు వదిలేయాలని నిర్ణయించడంతోనే తనతోపాటు కొందరు నేతలు పార్టీ మారారన్నారు.

కాగా కాంగ్రెస్‌ లో చేరాలని ఆ పార్టీ నేతలు తనకు కన్ను గీటుతున్నారని మాగంటి గోపీనాథ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.

తనతో పాటు ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను, అంబర్‌ పేట్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ ను పార్టీలోకి తీసుకొస్తానని కాంగ్రెస్‌ కు దానం నాగేందర్‌ హామీ ఇచ్చినట్టు తనకు సమాచారం ఉందన్నారు.

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ లో చేరడాన్ని మాగంటి గోపీనాథ్‌ ఖండించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే దానం కాంగ్రెస్‌ లో చేరారని ఆరోపించారు. తనపై ఎలాంటి కేసులు లేనందున తనకు ఎలాంటి భయం లేదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ లో చేరబోనన్నారు. జైలుకు పోయినోళ్లు సీఎంలు అవుతున్నారని, తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాగంటి గోపీనాథ్‌ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత కూడా జైలుకు వెళ్లిందని, ఆమె కూడా సీఎం అవుతారా అని ప్రశ్నించగా.. అవుతుందేమోననన్నారు.

కాగా కమ్మ సామాజికవర్గానికి చెందిన మాగంటి గోపీనాథ్‌ 2014, 2019 ఎన్నికల్లో హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున రెండుసార్లు గెలుపొందారు.

కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతే అయిన మాగంటి గోపీనాథ్‌ ఆంధ్రప్రదేశ్‌ లో టీడీపీ గెలవదని.. వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడం హాట్‌ టాపిక్‌ గా మారింది. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News