బీజేపీ ఎన్నికల పన్నాగం బయట పెట్టిన 'మహాదేవ్ యాప్'
ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఇప్పుడు వాస్తవాలు అలా బయటకు వచ్చాయి. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన అసీందాస్.. అసలు విషయం బయట పెట్టాడు.
మహాదేవ్ యాప్.. ఈ పేరు ఈ నెల తొలి రెండు వారాల్లో భారీ స్థాయిలో దేశాన్ని కుదిపేసింది. ఇది బెట్టింగ్ యాప్. దీనిని ఛత్తీస్‌గఢ్లో అనుమతించడం ద్వారా ముఖ్యమంత్రి భూపేష్ బఘల్ వారి నుంచి రూ.508 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని.. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి హోం మంత్రి అమిత్ షా వరకు తీవ్రస్థాయిలో ఆరోపించారు. సరిగ్గా.. ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు నాలుగు రోజుల ముందు.. అంటే నవంబరు 3న ఈ కేసు వెలుగు చూసింది. అంతే.. ఒక్కసారిగా వాలిపోయిన.. ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్‌కు సంబంధించి ఒక కానిస్టేబుల్ సహా.. మరో వ్యక్తి(అసీం దాస్)ని అరెస్టు చేశారు.
ఇక, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ.. ఎటు విన్నా.. ముఖ్యమంత్రి బఘేల్ అవినీతి చేశాడని.. ఈయన అవినీతి ముఖ్యమంత్రి అని.. ఆయనను గెలిపిస్తే..రేపు రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తాడని..రేపో మాపో జైలుకు వెళ్లడం ఖాయమని.. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అమిత్ షా సహా బీజేపీ నేతలుపెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది ఈ నెలలో జరిగిన రెండు దశల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అధికారపార్టీ కాంగ్రెస్‌కు ఇదే శరాఘాతమని విశ్లేషణలు కూడా వచ్చాయి. సరే.. ఈ గందరగోళం .. వివాదాలు.. అవినీతి ఆరోపణల మధ్యే ఎన్నికలు ముగిశాయి.
ఎన్నికలు ఇలా ముగిశాయో..లేదో.. ఇప్పుడు వాస్తవాలు అలా బయటకు వచ్చాయి. ఈ కేసులో ఈడీ అరెస్టు చేసిన అసీందాస్.. అసలు విషయం బయట పెట్టాడు. తాను ఎవరికీ ఎలాంటి డబ్బుల కట్టలు అందించలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పాడు. అంతేకాదు.. తనను అరెస్టు చేసిన ఈడీ డైరెక్టర్‌కు కూడా లేఖ రాశాడు. అంతేకాదు.. ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా లేఖ రాశాడు. ఈ కేసులో తనను కుట్ర పూరితంగా అరెస్టు చేశారని.. ఇరికించారని.. తనకు తెలియని ఇంగ్లీష్ భాషలో ఉన్న లెటర్‌పై సంతకాలు చేయించారని దాస్ ఆరోపించారు.
దీంతో ఛత్తీస్‌గఢ్ ఎన్నికల వేళ ఏ అవినీతిని అడ్డు పెట్టుకునిప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారో.. అక్కడి ముఖ్యమంత్రి బఘేల్‌ను బద్నాం చేశారో.. ఇప్పుడు అదే కేసులో కీలక నిందితుడని పేర్కొన్న దాస్.. అసలు గుట్టు బట్టబయలు చేయడంతో బీజేపీ పన్నాగం బయట పడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దాస్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న మేజిస్ట్రేట్.. ఈ కేసు కీలక మలుపు తిరిగిందని వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ కూడా.. దీనిని మోడీ పన్నాగంగా ఎన్నికల్లో గెలిచేందుకు వాడుకున్న అస్త్రంగా విమర్శలు గుప్పించింది.