అరికెపూడి అరెస్ట్.. వివాదంపై టీపీసీసీ చీఫ్ స్పందన ఇదే..!

ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్ని వివాదంలో చివరకు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

Update: 2024-09-12 09:56 GMT

ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య నెలకొన్ని వివాదంలో చివరకు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏకంగా ఓ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసే వరకూ పరిస్థితులు దారితీశాయి. పీఏసీ చైర్మన్‌గా గాంధీ ప్రకటించడంతో మొదలైన ఈ వివాదం ఇద్దరి మధ్య తీవ్ర సవాళ్ల వరకూ వెళ్లింది.

అరికెపూడి గాంధీ, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. అరికెపూడి వర్గీయులను కట్టడి చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో ఆయన అనుచరులు కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లారు.

అటు కౌశిక్ వర్గీయులు సైతం ఎదురుదాడికి దిగడంతో యుద్ధ వాతావరణం కనిపించింది. వివాదం అక్కడితో ఆగకుండా అరికెపూడి అనుచరులు రాళ్లు, టమాటాలను కౌశిక్ ఇంటిపైకి విసిరారు. ఈ దాడితో ఆయన ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

అక్కడే గాంధీ ధర్నాకు దిగారు. తాను ఇక్కడే ఉన్నానని.. కౌశిక్ రెడ్డి దమ్ముంటే బయటకు రావాలని సవాల్ చేశారు. ఇక పరిస్థితి చేజారుతున్న క్రమంలో పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. అక్కడే ఉన్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని, మరో నలుగురు కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.

ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. అరికెపూడి గాంధీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాడిన భాష సరిగా లేదని అన్నారు. ఎవరు ఎవరిపై దాడిచేసినా కాంగ్రెస్ పార్టీ సమర్థించదని, ఈ దాడితో తమ పార్టీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే గాంధీ అనుచరులు ఆగ్రహించారని, అరికెపూడి టెక్నికల్‌గా బీఆర్ఎస్ సభ్యుడేనని చెప్పారు. నిబంధనల మేరకే పీఏసీ చైర్మన్ అయ్యారని, ఉప ఎన్నికలు వచ్చినా కేటీఆర్‌కు నిరాశ తప్పదని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News