"హోం" ఇస్తే కారు దిగిపోయి కాంగ్రెస్ లోకి... మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీమంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ.. ."పూలమ్మినా.. పాలమ్మినా.." డైలాగ్ కంఠస్థం వచ్చేసిన పరిస్థితి! ఇలా తెలంగాణ రాజకీయాల్లో కొంతమందికి ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నారు మల్లారెడ్డి! ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అవును... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీఆరెస్స్ నేతలు వరుసగా కారు దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీఆరెస్స్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలు.. ఇలా వారూ వీరూ అనే తారతమ్యాలేవీ లేకుండా కారు దిగి చెయ్యి అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంపై మల్లారెడ్డి ఆసక్తికరంగా స్పందించారు.
ఇందులో భాగంగా... తాను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమే అని చెబుతూనే... ఓ ఆసక్తికర కండిషన్ కూడా పెట్టారు. ఈ మేరకు.. తనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో హోంమంత్రి పదవి ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలో తక్షణమే చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు. అయితే... ఈ కండిషన్ కు సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారంటారా? అంటూ ఎదురైన ప్రశ్నకు కూడా మల్లారెడ్డి స్పందించారు.
వందకు వందశాతం సీఎం రేవంత్ రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వడని కుండబద్దలు కొట్టారు మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో... తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలా మద్యవర్తిత్వం చేయాలంటూ జర్నలిస్టులను కోరడం గమనార్హం. అదే సమయంలో... హోంమంత్రి పదవి కూడా ఇచ్చేటట్లు సీఎంతో మాట్లాడాలని జర్నలిస్టులను కోరుతున్నారు మల్లారెడ్డి!
మరోవైపు... మూడోసారి కూడా తెలంగాణలో బీఆరెస్స్ గెలిచి ఉంటే తన లెక్క వేరేగా ఉండేదన్నట్లుగా మొదలుపెట్టిన మల్లారెడ్డి... అదే జరిగి ఉంటే తాను కచ్చితంగా హోంమంత్రి అవుతుండేవాడినని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా... ఏడాదికి నాలుగు సినిమాలు తీస్తూ, ఓ కొత్త శాటిలైట్ ఛానెల్ కూడా పెట్టేవాడిని అని మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!