మీకేమైంది దీదీ? కాలిపోయి ఆరాక బూడిద ఎత్తేసుకోవటమేంది?
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖ అధినేతలకు ఒక్కోసారి ఏమవుతుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖ అధినేతలకు ఒక్కోసారి ఏమవుతుంది. వయసు పెరిగేకొద్దీ.. అనుభవం ఎక్కువ అవుతుంది. ఇలాంటప్పుడు సంక్షోభాల్లో ఎలా రియాక్టు కావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అదేం సిత్రమో కానీ.. 2011 నుంచి నాన్ స్టాప్ గా ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మమతా బెనర్జీకి ఎప్పుడు ఎలా వ్యవహరించాలి? ఎలాంటి పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలన్న విషయాల్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆమె.. ఇటీవల దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పీజీ వైద్య విద్యార్థిని దారుణ హత్యోదంతం అంశంపై స్పందించిన తీరు అర్థం చేసుకోనట్లుగా మారింది.
కొన్ని సందర్భాల్లో ప్రాధాన్యతల విషయంలో తప్పులు జరగొచ్చు. కానీ.. ఆ విషయాన్ని గుర్తించటానికి ఒకట్రెండు రోజులు సరిపోతుంది. లేదంటే.. మరో ఒక రోజు. కానీ.. వారాల తరబడి సాగుతున్నప్పటికీ ఆమె రియాక్టు అయిన తీరు షాకింగ్ గా మారింది. రాష్ట్ర రాజధానిలోని ఆర్ జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ మీద చోటు చేసుకున్న హత్యాచారంపై నెల రోజులకు పైనే వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన తీరు ఎలా ఉండాలి? ఎంత త్వరగా రియాక్టు కావాలి? కానీ.. ఇవేమీ కనిపించవు.
ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థుల్ని తన వద్దకు పిలిపించుకున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే విషయంలో ఫెయిల్ అయ్యారు.వారిని అదే పనిగా పిలవటం.. పంపటం లాంటి వాటితో మరింత డ్యామేజ్ చేసుకున్నారు. చివరకు సోమవారం రాత్రి చర్చల కోసం పిలిచిన ఆమె ఎట్టకేలకు వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించారు. ఇందులో భాగంగా కోల్ కతా నగర పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ ను ఆ పదవి నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించారు.
ముఖ్యమంత్రి నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు వైద్య విద్యార్థుల టీం (42 మంది)తో కలిసి భేటీ అయిన ఆమె.. చివరకు వారి డిమాండ్లకు తలొగ్గారు. మొత్తం డిమాండ్లలో 99 శాతం వరకు అంగీకరించినట్లుగా చెబుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్ కతా డిప్యూటీ కమిషనర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కౌస్తవ్ నాయక్, హెల్త్ సర్వీస్ డైరెక్టర్ దేవాశిష్ హల్దేర్ లను పోస్టుల నుంచి తొలగించారు. తాము డిమాండ్లను అంగీకరించినందున ఆందోళన విరమించాలన్న ఆమె.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోమన్న హామీ ఇచ్చారు.
మొత్తం ఐదు డిమాండ్లలో మూడింటికి ఓకే చెప్పిన ఆమె.. ఆరోగ్య కార్యదర్శి ఎన్ఎస్ నిగమ్ ను తొలగించేందుకు మాత్రం నో చెప్పారు. ఐదో డిమాండ్ అయిన వైద్య విద్యార్థిని హత్యాచార విచారణ అంశం తమ పరిధిలో లేదని.. సుప్రీంకోర్టు.. సీబీఐ వద్ద ఉన్నందున ఆ విషయంలో తాము ఏమీ చేయలేమన్నారు. మొత్తంగా చూస్తే.. నెల రోజుల తర్వాత ఏదైతే నిర్ణయాలు ప్రకటించారో.. అదే నిర్ణయాన్ని మొదటి నాలుగైదు రోజుల్లోనే చేసి ఉండొచ్చు. కానీ.. అలా చేయని కారణంగా తన ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేసుకున్న దీదీ తీరు చూస్తే.. ఆమె ఇంతటి వైఫల్యాన్ని ఎందుకు ఆహ్వానించినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.