332 మ‌ర‌ణాలు.. వంద‌ల మందిపై అత్యాచారాలు.. ఇప్ప‌టికి కుదిరిన శాంతి ఒప్పందం!

అయితే.. ఇంత జ‌రిగినా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకోలేదనే వాద‌న ఒక‌వైపు ప్ర‌తిప‌క్షాలు వినిపించాయి

Update: 2023-11-29 17:07 GMT

''ఒక శాంతి ఒప్పందం కుద‌రాలంటే.. వంద‌ల మంది ప్రాణాలు త్యాగం చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఒక్క‌రు మ‌ర‌ణించినా.. అది శాంతికి విఘాత‌మే!''- కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు నిత్యం ఆరాధించే స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ప్ర‌వ‌చించిన సూక్తి ఇది. కానీ, ఆయ‌న బొమ్మ‌ల‌కు దండ‌లు వేసి.. ఆయ‌న విగ్ర‌హాల‌ను రాజ‌కీయంగా వాడుకునే నాయ‌కులు.. ఆయ‌న చెప్పి విష‌యాల‌ను మాత్రం మ‌రుగున ప‌డేశారు. దాదాపు 1500 మంది..(332 అధికారికం) మ‌ర‌ణించాక‌.. వంద‌ల మంది మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు చేసి..రాష్ట్రాన్ని బుగ్గిపాలు చేశాక‌.. ఆయా ఘ‌ట‌న‌ల‌కు వెనుక ఉన్న‌వారితో తాజాగా కేంద్రం శాంతి ఒప్పందం చేసుకుంది.

ఈ ఏడాది.. ఫిబ్ర‌వ‌రి నుంచి ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్ అట్టుడికిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డ మైయిటీ తెగ‌వారు త‌మ‌కు కూడా రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే డిమాండ్‌తో లేవ‌నెత్తిన ఆందోళ‌న‌లు.. తీవ్ర విధ్వంసానికి, అత్యాచారాలు, హ‌త్య‌ల‌కు కూడా దారి తీశాయి. దేశం మొత్తం మ‌ణిపూర్‌లో ఏం జ‌రుగుతుందో అని ఊపిరి బిగ‌ప‌ట్టి మ‌రీ చూశాయి. ముఖ్యంగా ఆదివాసీ మ‌హిళ‌ల‌ను న‌గ్నంగా ఊరేగిస్తూ.. తీసుకువెళ్లి అత్య‌చారం చేయ‌డం.. అప్ప‌ట్లో తీవ్ర విషాదంగా మారింది. ఇక‌, ఆ త‌ర్వాత కూడా.. ఈ రిజ‌ర్వేష‌న్ వివాదం స‌మ‌సిపోలేదు. ఏదో ఒక రూపంలో విధ్వంసాల‌కు కార‌ణం అవుతూనే ఉంది.

అయితే.. ఇంత జ‌రిగినా.. కేంద్రంలోని మోడీ స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకోలేదనే వాద‌న ఒక‌వైపు ప్ర‌తిప‌క్షాలు వినిపించాయి. అత్యాచారాల‌ను దేశంపై జ‌రిగిన అత్యాచారాలుగా పేర్కొన్న మోడీ.. త‌ర్వాత మ‌ణిపూర్‌పై మౌనం పాటించారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. ఇంఫాల్‌ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ UNLFతో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు శాంతి ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్‌'లో ట్వీట్‌ చేశారు.

యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF) శాంతి ఒప్పందంపై సంతకం చేసిందని అమిత్‌ షా ప్రకటించారు. దీంతో ఈశాన్య ప్రాంతంలో శాశ్వతంగా శాంతిని పునరుద్ధరించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అవిశ్రాంత ప్రయత్నాలు నేటితో నెరవేరినట్లయిందని పేర్కొన్నారు. మణిపూర్‌లోని సాయుధ గ్రూపుగా వున్న UNLF హింసను వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అంగీకారం తెలిపిందని అమిత్‌షా తెలిపారు. వారందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నానని.. శాంతి, అభివృద్ధి మార్గంలో వారి ప్రయాణం సాగాలని ఆకాంక్షించారు. అయితే.. పేషంట్ చ‌చ్చిపోయిన త‌ర్వాత‌.. ఆప‌రేష‌న్ స‌క్సెస్ అయిన‌ట్టు ప్ర‌క‌టించ‌డంలా ఉంద‌ని విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

Tags:    

Similar News