పవన్ కు గుడి కట్టాలి... వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు!

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Update: 2024-07-08 10:26 GMT

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి ఘన విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది కీలకపాత్ర అని.. కేవలం పవన్ వల్ల మాత్రమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని.. ఈ గెలుపులో ఆయనే "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్" అనే కామెంట్లు వైసీపీ నుంచి బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో వైసీపీ నేత భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... నిన్న మొన్నటివరకూ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, నాలుగు పెళ్లాలు అంటూ పవన్ పై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు పూర్తయ్యి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం... కూటమి గెలుపు క్రెడిట్ మొత్తం పవన్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు అలవిగాని హామీలతో పాటు పవన్ ఛరిష్మా వల్లే టీడీపీ నేతలు కూడా గెలిచారని అంటున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ వల్లే గెలిచారు.. ఆయనకు వారంతా గుడి కట్టి పూజలు చేయాలి అంటూ కామెంట్ చేశారు మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భారత్. తాజాగా విభజన సమస్యలమీద రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన ఘటనపై స్పందిస్తూ... ఆ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ ను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ... టీడీపీ నేతలపై కామెంట్లు చేశారు.

ఇందులో భాగంగా... రెండు రాష్ట్రాల సీఎంలు భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారని గుర్తు చేసిన భరత్... మరి ఇంత కీలకమైన భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆహ్వానించకపొవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. అసలు ఇవాళ టీడీపీ కూటమి అధికారంలో ఉందంటే... దానికి నూటికి 99 మార్కులు పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని.. అలాంటి పవన్ లేకుండా సమావేశం జరిగిందని అన్నారు.

ఇదే క్రమంలో... రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పై స్పందించిన సందర్భంగా... తాను ఎలాంటి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యి నెల రోజులు కూడా కాలేదని.. 175 మంది ఎమ్మెల్యేలో అతడూ ఒకడని.. ఆ విషయం మరిచి సీఎంలా, డిప్యూటీ సీఎంలా మాట్లాడుతున్నాడని మండి పడ్డారు.

ఈ క్రమంలోనే తమరి బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లు వేయలేదు అని చెప్పిన భరత్... పవన్ కల్యాణ్ చరిష్మాతోనే గెలిచారని అన్నారు. ఇదే సమయంలో ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే... టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే అందుకు కారణం పవన్ కల్యాణ్ అని, ఆయనకు టీడీపీ వాళ్లంతా గుడికట్టి పూజలు చేయాలని, పవన్ లేకపోతే టీడీపీ నేతలు అధికారంలోకి రాలేదని భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News