నిన్న.. ఎలాన్ మస్క్, నేడు.. మార్క్ జుకర్ బర్గ్ అంతా అటు వైపే!
ఇప్పటికే ప్రచారం ఉధృతంగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కమల హారిస్, ఇటు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ ఏడాది నవంబర్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార డెమోక్రటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికే ప్రచారం ఉధృతంగా సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు కమల హారిస్, ఇటు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగానూ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు.
కాగా స్పేస్ ఎక్స్, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఇప్పటికే తన మద్దతును డోనాల్డ్ ట్రంప్ కు ప్రకటించారు. ట్రంప్ పై మస్క్ పలుమార్లు పొగడ్తల వర్షం కురిపించారు. ఈ క్రమంలో మస్క్ ను తాను ఎన్నికల్లో గెలిచాక ప్రభుత్వంలో చేరాలని ట్రంప్ ఆహ్వానించారు.
మరోవైపు మెటా (ఫేస్ బుక్ మాతృ సంస్థ), ఇన్ స్టాగ్రామ్ సంస్థల అధినేత మార్క్ జుకర్ బర్గ్ సైతం పరోక్షంగా డోనాల్డ్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమల హారిస్ నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
కోవిడ్ సంభవించినప్పుడు తనను డెమోక్రటిక్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని జుకర్ బర్గ్ ఆరోపించారు. ప్రాణాంతక కోవిడ్ కు సంబంధించిన పోస్టులను ఫేస్ బుక్ లో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని, సెన్సార్ చేయాలంటూ పదేపదే తనను తీవ్రంగా ఒత్తిడి చేశారని మండిపడ్డారు.
ఈ మేరకు యూఎస్ కాంగ్రెస్ హౌస్ జ్యుడిషియరీ కమిటీకి మార్క్ జుకర్ బర్గ్ తాజాగా రెండు పేజీల లేఖ రాశారు. ఈ లేఖను జ్యుడీషియరీ కమిటీ తన అధికారిక ఎక్స్ అకౌంట్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది బయటకొచ్చింది.
ఈ లేఖలో జుకర్ బర్గ్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. కోవిడ్‌పై సెటైరికల్ కామెంట్స్ మొదలుకుని ఎలాంటి కంటెంట్ అయినా సరే.. వాటిని సెన్సార్ చేయమంటూ నెలల తరబడి పదేపదే తనపై ఒత్తిడి తెచ్చారని మార్క్ జుకర్ బర్గ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఫేస్ బుక్ లో అమెరికన్ల కోవిడ్ సమాచారాన్ని సెన్సార్ చేయాలని జో బైడెన్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెచ్చిందని జుకర్ బర్గ్ ఆరోపించారు. అలాగే అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ వివాదాస్పద ల్యాప్ టాప్ కథనాలను కూడా ఫేస్ బుక్ లో పోస్టు కానీయకుండా అడ్డుకుందని బాంబుపేల్చారు. ఈ మేరకు 2021లో అమెరికా అధ్యక్ష నివాసం.. వైట్ హౌస్ సీనియర్ అధికారుల నుంచి తనకు లేఖలు అందాయని జుకర్ బర్గ్ ఆ లేఖలో పేర్కొన్నారు.
తనపై పదే పదే ఒత్తిడి తేవడంతో జో బైడెన్, కమలా హారిస్ ప్రభుత్వానికి తాను తలవంచాల్సి వచ్చిందని మార్క్ జుకర్ బర్గ్ వాపోయారు. ఫేస్ బుక్ లో పోస్టు చేసే కంటెంట్ ను సెన్సార్ చేయడానికే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. తద్వారా స్వేచ్ఛగా ప్రజల అభిప్రాయాలను తెలపనీయకుండా ఫేస్ బుక్ ను నియంత్రించారని ఆరోపించారు.
అయితే ఆ సమయంలో (2021)లో ప్రభుత్వ ఒత్తిళ్లతో తమ కంటెంట్ ప్రమాణాలపై రాజీ పడకూడదని నిర్ణయించుకున్నామని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇదే విషయాన్ని తన బృందానికి వివరించానన్నారు. మరో రెండు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ, ప్రస్తుతం హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న సందర్భంగా మార్క్ జుకర్ బర్గ్ లేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.