ఎకరం పొలం అమ్మి.. అమరావతికి ఇచ్చిన ఆమె ఎవరంటే?

ఇదే సమయంలో అమరావతికి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు ఏలూరుకు చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాన్ని అందించారు.

Update: 2024-06-23 04:27 GMT

ఏపీ రాజధాని అమరావతి కోసం ఒక వైద్య విద్యార్థిని తన ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళంగా ఇచ్చిన వైనం ఆసక్తికరంగా మారింది. పదేళ్ల క్రితం ఉమ్మడి ఏపీ విభజన తర్వాత.. విభజిత ఏపీకి రాజధాని లేకపోవటం.. అమరావతిని రాష్ట్ర రాజధానిగా డిసైడ్ చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పట్లో పెద్ద ఎత్తున విరాళాలు అప్పటి ప్రభుత్వానికి అందాయి. కాకుంటే.. తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని అమరావతి స్థానే మూడు రాజధానుల కాన్సెప్టును తీసుకురావటం.. దీంతో గందరగోళం చోటు చేసుకోవటం తెలిసిందే.

మూడు రాజధానుల్ని వ్యతిరేకిస్తూ.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి రైతులు ఏళ్లకు ఏళ్లు పెద్ద ఉద్యమమే చేశారు. కానీ.. అప్పటి ప్రభుత్వ తీరు కారణంగా వారి త్యాగాలు బయట ప్రపంచానికి పెద్దగా తెలియరాలేదు. కట్ చేస్తే.. తాజాగా ఎన్డీయే కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. అమరావతిని రాజధానిగా.. ఐదేళ్ల క్రితం ఆగిన పనుల్ని వాయు వేగంతో మొదలు పెడుతున్నారు.

ఇదే సమయంలో అమరావతికి ఆర్థికంగా చేయూతను ఇచ్చేందుకు ఏలూరుకు చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాన్ని అందించారు. తనకున్న మూడు ఎకరాల్లో ఒక ఎకరాన్ని అమ్మిన ఆమెకు రూ.25 లక్షలు వచ్చాయి. ఈ మొత్తాన్ని అమరావతి నిర్మాణం కోసం వెచ్చించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కోరారు.

తనకున్న భూమిలో ఎకరం భూమిని అమ్మి తీసుకొచ్చిన మొత్తాన్నిసీఎం బాబుకు అందజేశారు. అంతేకాదు.. తనకున్న బంగారు గాజుల్ని అమ్మిన ఆమె, వాటి ద్వారా వచ్చిన రూ.లక్షను పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేయాలని కోరారు.

అంతేకాదు.. తన మాదిరి అమరావతి నిర్మాణానికి అందరూ ముందుకు రావాలని కోరుతున్నారు. 'రాజధానిని నిర్మిద్దాం - రాష్ట్రాన్ని అభివృద్ది చేద్దాం' అనే ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వానికి తనవంతు సాయం చేస్తున్నట్లు ఆమె చెబుతున్నారు.

Tags:    

Similar News