ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే భార్య
గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం.. అర్థరాత్రికి కానీ బయటకు రాలేదు.
షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కారణం ఏమైనా కానీ.. ఒక ఎమ్మెల్యే సతీమణి సూసైడ్ చేసుకున్న షాకింగ్ సీన్ ఒకటి తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి రూపాదేవి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
గురువారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ విషాద ఉదంతం.. అర్థరాత్రికి కానీ బయటకు రాలేదు. హైదరాబాద్ మహానగర శివారులోని అల్వాల్ లోని పంచశీల కాలనీలో నివాసంలో ఆమె ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్న ఆమె.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న విషయం బయటకురాలేదు.
ఈ ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి. అమ్మాయి రిషిక (12) పెద్దది కాగా.. కొడుకు లోకేశ్ (10) చిన్నవాడు. ఎమ్మెల్యే సతీమణి రెండు రోజులుగా స్కూల్ కు వెళ్లలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే గురువారం ఉదయమే తన నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే ఫ్యామిలీ మొత్తం తన బంధువులతో కలిసి తిరుమలతో సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకొని వచ్చారు.
భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసినంతనే ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు. ఆయన తీవ్రంగా శోకిస్తున్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ఆత్మహత్య ఉదంతం వెలుగు చూడటంతో ఆయన్ను పరామర్శించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ తో సహా పలువురు నేతలు ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. ఈ షాకింగ్ పరిణామంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే సతీమణి రూపాదేవి డెడ్ బాడీని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు కారణం ఏమిటి? ఆమె ఆత్మహత్య చేసుకున్న సమయంలో పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? రూపాదేవి ఆత్మహత్యను ఎవరు చూశారు? ఎప్పుడు తెలిసింది? ఎమ్మెల్యేకు ఎప్పుడు సమాచారం అందించారు? లాంటి ప్రశ్నలకు సమాదానాలు రావాల్సి ఉంది.