జార్జ్ సోరోస్‌తో సోనియాకున్న సంబంధాలేంటి..? లోక్‌సభలో దుమారం
తాజాగా.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోనియా గాంధీ మీద చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
పార్లమెంట్ సమావేశాలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే.. బీజేపీ సైతం అదే స్థాయిలో దీటుగా బదులిస్తోంది. ఇప్పటికే అదాని లంచం కేసు విషయమై పార్లమెంటులో దుమారం రేపగా.. తాజాగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీపై కీలక ఆరోపణలు చేసింది.
పార్లమెంటు సమావేశాల్లో గత రెండు రోజులుగా అదాని అంశంపై వాడివేడి చర్చ కొనసాగుతోంది. ఇవాళ కూడా పార్లమెంట్ బయట పలువురు ప్రతిపక్ష నేతలు అదాని బొమ్మలతో కూడిన మాస్కులను ధరించి నిరసనకు దిగారు. తాజాగా.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోనియా గాంధీ మీద చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. జార్జ్ సోరోస్‌కు చెందిన ఫౌండేషన్ ద్వారా నిధులు సమకూర్చిన సంస్థలతో సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ సైతం ఆరోపణలు చేసింది. కశ్మీర్‌ను ప్రత్యేక ప్రాంతంగా పరిగణించడం వంటి వివాదాస్పద వైఖరికి ఈ సంస్థలు మద్దతుగా నిలిచినట్లు బీజేపీ గుర్తుచేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డెమోక్రాటిక్ నేతల ఫోరానికి సోనియా గతంలో నాయకత్వం వహించిన అంశాన్ని సైతం బీజేపీ లేవనెత్తింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కూ, జార్జ్ సోరోస్ సంస్థలకు ఉన్న సంబంధాలను కూడా తెర మీదకు తీసుకొచ్చింది.
అయితే.. సోనియా గాంధీ మీద వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఆరోపణలు నిరాధారం అని అన్నారు. అంతటితో ఆగకుండా కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో రచ్చ చేశారు. దీంతో లోక్‌సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ.. స్పీకర్ ఓం బిర్లా తన స్థానానికి చేరుకోగానే విపక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి సమస్యలను లేవనెత్తడం ప్రారంభించారు. ప్రశోత్తరాల సమయంలో ఎలాంటి అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. సభా కార్యక్రమాలు సమంజసంగా జరిగేందుకు సహకరించాలని, కానీ.. మీరు మాత్రం సభలో గోల చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత స్పీకర్ సభను వాయిదా వేశారు.