ఆయనకు పెద్దిరెడ్డి విలువైన కారు గిఫ్ట్ ఎందుకిచ్చినట్టు!
రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా వరుసగా విజయం సాధించారు. అయితే వీరిద్దరి మెజారిటీలు చాలా భారీగా తగ్గిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన అతి కొద్ది మందిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి ఉన్నారు. రామచంద్రారెడ్డి పుంగనూరు నుంచి, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా వరుసగా విజయం సాధించారు. అయితే వీరిద్దరి మెజారిటీలు చాలా భారీగా తగ్గిపోయాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పెద్దిరెడ్డి కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో పర్యటించడానికి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒప్పుకోలేదనే విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు పలుమార్లు తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంలో పెద్దిరెడ్డిదే కీలక పాత్ర అని టీడీపీ శ్రేణుల అభియోగం. అలాగే పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో చంద్రబాబుపై రాళ్ల దాడి చేయించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పైగా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలపైనే ఎదురు కేసులు పెట్టించారని అభియోగాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక నాడు చంద్రబాబుకు ఏదైతే జరిగిందో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఆయన తనయుడు మిథున్ రెడ్డికి జరుగుతోంది. వారు తమ నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ టీడీపీ ్రÔó ణులు వారిని అడ్డుకుంటున్నాయి. ఇటీవల మిథున్ రెడ్డి.. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పను కలవడానికి వచ్చినప్పుడు వైసీపీ, టీడీపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణలో రెడ్డప్ప కారు ధ్వంసమైంది. ఆయన వాహనాన్ని తగులబెట్టారు.
ఈ నేపథ్యంలో తాజాగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. మాజీ ఎంపీ రెడ్డప్పకు విలువైన కారును బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. రూ.20 లక్షల విలువైన కారును రెడ్డప్పకు కానుకగా అందజేశారు. నాడు తన పర్యటన వల్లే ఆయన కారు ధ్వంసమైందని భావించిన మిథున్ రెడ్డి ఈ మేరకు రెడ్డప్ప ఇంటికి వెళ్లి ఆయనకు కారు తాళాలను అందించారు.
తన పర్యటన నేపథ్యంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందుగానే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల అనుమతితో ఆయన రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. ఆయనకు కారు తాళాలు అందజేశారు.
కాగా పుంగనూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఇంకా కుదుటపడలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు వేలాది ఎకరాలను తన కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల పేరిట స్వాహా చేశారని ఇప్పటికే ఆయనపై కేసులు నమోదయ్యాయి. పలువురు ప్రజలు, బాధితులు తమ భూములను పెద్దిరెడ్డి అనుచరులు, బంధువులు కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు ఈ భూకబ్జాలకు సంబంధించి ఫైళ్లు, విలువైన సమాచారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నికి ఆహుతయ్యాయి. దీనిపైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పలువురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.