ఎమ్మెల్సీ ఎన్నికలు...వైసీపీలో ఫుల్ సైలెన్స్
తమ బలం ఏంటో చూసుకోవడంతో పాటు ప్రజాభిమానం ఎలా ఉందో కొలమానానికి ఈ ఎన్నికలు దోహదపడతాయి.
ఎన్నికలు అన్నవి రాజకీయ పార్టీలకు అత్యవసరం. ప్రతీ విధ్యార్ధికి పరీక్షలు ఉన్నట్లుగానే రాజకీయ పార్టీలకు ఎన్నికలే పరీక్షలు. తమ బలం ఏంటో చూసుకోవడంతో పాటు ప్రజాభిమానం ఎలా ఉందో కొలమానానికి ఈ ఎన్నికలు దోహదపడతాయి. అంతే కాదు తప్పులు ఒప్పులు అన్నవి కూడా తెలుస్తాయి.
ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పై దాటింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సమయానికి అయిదారు నెలలు నిండుతాయి. అంటే ప్రభుత్వానికి హానీమూన్ పీరియడ్ పూర్తి అవుతుంది.
అంత మాత్రం చేత ప్రభుత్వం మీద ప్రజలు అపుడే ఒక నిర్ణయానికి వచ్చేస్తారు అని కాదు. ప్రభుత్వం ఇంకా సర్దుకుంటుందని తమ సమస్యలు డిమాండ్ల పట్ల నెమ్మదిగా అయినా స్పందిస్తుంది అని ఇంతకాలం టైం ఇస్తారు. అవి కనుక ఆ మీదట కూడా నెరవేరకపోతే మెల్లగా అసంతృప్తి మొదలవుతుంది. అది కాస్తా తీవ్రంగా మారి ఆ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని ఆలోచన రావాలి అంటే కనీసం ఏడాది టైం అయినా అవసరం పడుతుంది.
అయితే టీడీపీ కూటమికి హానీమూన్ పీరియడ్ ముగిసీ ముగియక ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం ఒక విధంగా మంచి అడ్వాంటేజ్ అని అంటున్నారు. మరో వైపు చంద్రబాబు ఒక్కో విషయం మీద తన ప్రభుత్వం విధానాలను యాక్షన్ ప్లాన్ ని ప్రకటిస్తున్నారు.
అన్నింటినీ షెడ్యూల్ చేస్తూ వస్తున్నారు. ఒక నిర్దిష్ట కాల పరిమితిలో అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ పూర్తి చేస్తామని చెబుతున్నారు సంక్షేమ పధకాల విషయంలో అయితే ఒక్కో హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్ధి అజెండాను కూడా జనంలో పెడుతున్నారు. ఇంకో వైపు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు.
ఇవన్నీ జనంలో ఉండగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వం మీద ఏ మేరకు విశ్వాసం ఉంచారు అన్నది తెలుస్తుంది. నిజానికి పట్టభద్రులలో యువత ఎక్కువగా ఓటర్లుగా ఉంటారు. వారు అపుడే తొందరపడి కూటమికి యాంటీగా ఓట్లు వేస్తారని చెప్పడానికి లేదు అని అంటున్నారు.
అంతే కాదు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాలు చూస్తే కృష్ణా గుంటూరు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు. ఈ నాలుగు జిల్లాలలో కూటమి అత్యంత పటిష్టంగా ఉంది. టీడీపీ జనసేన కడు బలంగా ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ 2019 తప్పించి 2014లోనూ అంత బలంగా ఇక్కడ లేదు. 2024లో చూస్తే మొత్తం ఎక్కడా బోణీ కూడా కొట్టలేక చతికిలపడింది.
అంతే కాదు గత నాలుగైదు నెలలుగా చూసుకుంటే వైసీపీ నుంచి వరసబెట్టి నేతలు కూటమి పార్టీలలోకి పోతున్నారు. రాజకీయంగా వైసీపీ ఇబ్బంది పడుతోంది. ఈ మొత్తం పరిణామాలను కనుక చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీ పోటీకి దిగితే లాభించే అవకాశాలు ఎంతమేరకు అంటే ప్రస్తుతానికి అయితే చెప్పడానికి ఏమీ లేదు అనే అంటున్నారు.
ఇక క్రిష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు గానూ వైసీపీ ట్రేడ్ యూనియన్ లీడర్ గౌతం రెడ్డిని పార్టీ ఎంపిక చేసింది. అక్కడ టీడీపీ కూటమి నుంది మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఆయనకు పూర్తి మద్దతు మూడు పార్టీల నుంచి ఉంది.ఆయన ప్రచారం కూడా మొదలెట్టేశారు.
పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను కూడా కూటమి నేతలే ఎక్కువగా చేస్తున్నారు. అదే వైసీపీలో ఒక సైలెంట్ వాతావరణం కనిపిస్తోంది. గౌతం రెడ్డి ప్రచారంలోకి దిగుతున్నారా అన్నది అయితే తెలియడం లేదు. ఒకవేళ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే పట్టభద్రుల ఓటర్ల నమోదుని వైసీపీ కూడా ప్రారంభించాల్సి ఉంది.
మరో వైపు చూస్తే ఉభయ గోదావరి జిల్లాలలో అయితే వైసీపీ అభ్యర్ధిని సైతం ఎంపిక చేయలేదు. మొత్తానికి చూస్తే వైసీపీలో నిశ్శబ్దం అలా కొనసాగుతోంది. ఎందుకు అన్నది తెలియడం లేదు. ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటే కనీసం పోటీ గట్టిగా ఉంటుందని లేకపోతే అభాసు అవుతారని అంటున్నారు. చూడాలి మరి వైసీపీకి ఈ ఎన్నికల మీద ధీమా ఏ మేరకు ఉందో ఏమిటో అన్నది.