స్థాయి విజయం ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ అవుతుందా ?
విశాఖకు సంబంధించి రెండు కీలక ఎన్నికలు ఆగస్ట్ లో రాజకీయంగా ప్రభావం చూపిస్తాయని అంతా భావించారు.
విశాఖ నగర పాలక సంస్థకు జరిగిన స్థాయీ సంఘం ఎన్నికలో టీడీపీ కూటమి అద్భుతమైన విజయం సాధించింది. పదికి పది స్థానాలను దక్కించుకుంది. దాంతో వైసీపీ శిబిరంలో తీవ్ర నిరాశ కనిపిస్తోంది. విశాఖకు సంబంధించి రెండు కీలక ఎన్నికలు ఆగస్ట్ లో రాజకీయంగా ప్రభావం చూపిస్తాయని అంతా భావించారు.
అందులో మొదటిది స్థాయీ సంఘం ఎన్నికలు. ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడించి కూటమి గెలిచి తన సత్తా చాటుకుంది. అలా పూర్తి ధీమాతో ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. తమకు బలం లేని చోట స్థాయీ సంఘం ఎన్నికల్లో పోటీకి దిగి మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకోవడం ద్వారా కూటమి తన వ్యూహాలు ఎలా ఉంటాయో వైసీపీకి విప్పి చెప్పినట్లు అయింది.
ఇక దీని కంటే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలను కూటమి ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అక్కడ కూడా కూటమికి బలం లేదు. కానీ అధికార పార్టీకి తనకు ఉన్న అన్ని అవకాశాలను సొమ్ము చేసుకుంటోంది. అదే సమయంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలు చూస్తూంటే కూటమి దూకుడు తో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.
నిజానికి చూస్తే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీకి ప్రకటించి చాలా రోజులు అయింది. ఆయన దగ్గరుండి స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీ తరఫున వ్యూహ రచన చేస్తే బాగుండేది అని అంటున్నారు. ఎందుకంటే ఈ కార్పోరేటర్లు రేపటి రోజున ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా ఉంటారు.
ఈ విజయమే రేపటి విజయానికి సోపానం అవుతుంది. కానీ వైసీపీ పెద్దలు ఎవరూ సరిగ్గా వ్యవహరించలేదు అని అంటున్నారు. రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి సైతం అంత సీరియస్ గా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. దీంతో కూటమి విజయాన్ని దక్కించుకుంది. ఇదే తీరున ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం భారీ దెబ్బ పడుతుంది అని అంటున్నారు.
స్థాయీ సంఘం ఎన్నికలను ఒక గుణపాఠంగా తీసుకుని వైసీపీ అంతా పటిష్టమైన వ్యూహాలకు పదును పెట్టాలని కోరుతున్నారు. ముందుగా తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులలో విశ్వాసం కలిగించాలని అంటున్నారు. అవతల వైపు కూటమి అన్ని రకాలైన అస్త్రశస్త్రాలతో ఎదురు నిలిచి ఉన్న వేళ వైసీపీ సర్వసన్నద్ధంగా తయారు కాకపోతే మాత్రం ఈ నెల 30న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇబ్బందులు వచ్చినా రావచ్చు అని అంటున్నారు.