తెలంగాణలో 'పేర్ల మార్పు' రాజకీయం!
ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాలను తొలగించడం, కూల గొట్టడం కూడా చేశారు.;
మహనీయులు ఊహించని విధంగా వారి పేర్లతో రాజకీయం తెలంగాణలో కొనసాగుతూనే ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. అనేక యూనివర్సిటీలకు, ప్రాంతాలకు కూడా ఆయన పేర్లు మార్చారు. మహా కవులు, రచయితలు, రాజకీయ నాయకులు.. వంటి వారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సేవ చేశారు. త్యాగాలు చేశారు. అయితే.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీకి చెందిన నాయకులు, మహనీయులను కూడా విలన్లుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉవ్వెత్తున సాగేలా చేశారు.
ఈ నేపథ్యంలోనే ట్యాంక్ బండ్‌పై ఉన్న మహనీయుల విగ్రహాలను తొలగించడం, కూల గొట్టడం కూడా చేశారు. ఇక, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. మరింతగా తనను తాను ప్రొజెక్టు చేసుకునేందుకు ఇతర ఏ రాజకీయ పార్టీకి కూడా.. తెలంగాణ సెంటిమెంటు దక్కకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన విజృంభించారు. ఈ క్రమంలో పలు సంస్థలు, విద్యాలయాలు, ప్రాంతాల పేర్లను మార్పు చేశారు. తెలంగాణ నాయకుల పేర్లను పెట్టారు.
తెలంగాణ నాయకుల పేర్లు పెట్టడానికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా.. కానీ.. ఉమ్మడి ఏపీ కోసం ఉద్యమించిన వారిపై కూడా.. 'ఆంధ్ర' ముద్ర వేసి.. వారికి అవమానం జరిగేలా వ్యవహరించడమే అప్పుడు తీవ్ర వివాదానికి దారి తీసింది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తుండడం పట్ల మేధావులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడం పట్ల పెదవి విరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ స్టంటులో భాగమేనని.. కేసీఆర్ ఏదో చేశాడు కాబట్టి.. తాము కూడా ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా అడుగులు వేస్తున్నారని మేధావులు చెబుతున్నారు. ఇలా పేర్లు మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని.. ప్రజలు ఈ మార్పులను చూసి ఓటేయరనికూడా వ్యాఖ్యానిస్తున్నారు. అయినప్పటికీ.. పేర్ల మార్పు రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి.