రేవంత్ దూకిన గోడల లెక్కలు చెప్పాలా?
71 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాలేమని రేవంత్ రెడ్డి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు.;
తెలంగాణ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సోమవారం మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పాలన పూర్తిగా విఫలమైందని స్వయంగా ఒప్పుకున్నారని కేటీఆర్ అన్నారు. 71 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకురాలేమని రేవంత్ రెడ్డి అంగీకరించారని ఆయన పేర్కొన్నారు. 2014లో రేవంత్ రెడ్డి వంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయి ఉంటే, తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతుందని సమైఖ్యాంధ్ర నాయకులు చెప్పిన మాటలు నిజమయ్యేవని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
"మాకు కుటుంబాలు, పిల్లలు లేరా? రేవంత్ రెడ్డికి మాత్రమే ఉన్నారా? నాకు ఇష్టం వచ్చిన వారితో సంబంధాలు అంటగట్టినప్పుడు మా కుటుంబాలు బాధపడలేదా? ఢిల్లీలో రేవంత్ రెడ్డి దూకిన గోడలు, హైదరాబాద్‌లో దాటిన గీతలు, ఆయన వ్యాపారాలు బయటపెట్టాలా? పిచ్చి పనులు చేస్తున్నారు కాబట్టే ప్రజలు ముఖ్యమంత్రిని తిడుతున్నారు. నిండు సభలో బట్టలు విప్పి కొడతామని రేవంత్ బజారు భాష మాట్లాడారు" అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదటి ఏడాది పాలనలో రేవంత్ రెడ్డికి పాస్ మార్కులు కూడా రావని కేటీఆర్ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రేవంత్ రెడ్డి స్వయంగా అంగీకరించారని ఆయన పునరుద్ఘాటించారు. రేవంత్ రెడ్డికి సంపద సృష్టించే జ్ఞానం, తెలివి లేవని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చితే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రశ్నించారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ నిధులు సాధిస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎంత మొత్తంలో నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్‌పై ఉన్న కోపంతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గాసిప్‌లు ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పదిహేను సంవత్సరాలుగా రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్‌లో పేకాట ఆడేవారితో గాసిప్‌లు నడపడం అలవాటని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర బడ్జెట్ గురించి అడిగితే ముఖ్యమంత్రి ఢిల్లీకి పంపే మూటల గురించి మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు డబ్బులు పంపే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రాజాసింగ్‌ను సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ఆయన సవాల్ విసిరారు. సోషల్ మీడియా ప్రపంచవ్యాప్తంగా ఉందని, అమెరికాలో ఉన్న వ్యక్తి పెట్టిన కామెంట్‌కు ఎలా శిక్షిస్తారని రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సాగర్ సొసైటీలో ఎంత సమయం గడిపారో తనకు తెలుసని, ఇప్పటికీ ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ ఉదయం 5 గంటలకు మైహోం బూజాకు వెళ్తున్నారని కేటీఆర్ తెలిపారు. బీజేపీ నేతల బాగోతాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న తమకు అందరి గురించి తెలుసని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫార్ములా ఈ-రేసింగ్ కేసును రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా తాను వదిలిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రేసింగ్ ఏకపక్ష రద్దుపై విచారణ జరుపుతామని ఆయన చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతుందో రేవంత్ రెడ్డికి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని క్యాన్సర్ రోగితో పోల్చిన వ్యక్తికి ఒలింపిక్స్ కావాలా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం విషయంలో తాము కూడా తప్పు చేశామని ఆయన అంగీకరించారు. ఎంఐఎంకు ఉన్న సంఖ్యా బలం ఎంత? అక్బరుద్దీన్ ఒవైసీకి ఎంత సమయం ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ప్రసంగాన్ని పది నిమిషాల్లో ముగించాలని ఆయన డిమాండ్ చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చి ఈసారి తామేంటో ఎంఐఎంకు చూపిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అక్బరుద్దీన్ వైఖరిని గమనించామని ఆయన తెలిపారు. అలగడం, ఏదో ఒక పని చేయించుకోవడం ఆయన స్వభావమని కేటీఆర్ అన్నారు. వారి పని అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలే చెబుతున్నారని, బీఆర్ఎస్ ప్రత్యామ్నాయమని మంత్రులే చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అందాల పోటీలు పెట్టి ఏం సాధించాలనుకుంటున్నారో చెప్పాలని, రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేని సమయంలో అందాల పోటీలకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేసింగ్ నిర్వహిస్తే ఎలా తప్పవుతుందని కేటీఆర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.