ఐఏఎస్ పోస్టింగుల్లో వ్యత్యాసం.. ప్రభుత్వంపై ప్రమోటీ ఐఏఎస్ అధికారుల అసంతృప్తి?
తమకు అన్యాయం జరుగుతోందని కంపర్డ్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి చెందడమే కాకుండా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.;
ఏపీలో ఐఏఎస్ అధికారుల పోస్టింగుల్లో వివక్ష, వ్యత్యాసం చోటుచేసుకుంటుందా? డైరెక్ట్ ఐఏఎస్ లకు ఒక విధంగా ప్రమోటీ ఐఏఎస్ లకు మరోరకమైన పోస్టింగులు ఇస్తున్నారా? ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా చెప్పే ఓ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం రాష్ట్రంలో ఆర్ఆర్ ఐఏఎస్ లు, కంఫర్డ్ ఐఏఎస్ అధికారుల మధ్య వ్యత్యాసం చూపుతున్నారని పేర్కొంది. తమకు అన్యాయం జరుగుతోందని కంపర్డ్ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి చెందడమే కాకుండా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర పాలన యంత్రాంగంలో కీలకమైన ఐఏఎస్ అధికారులు రెండు రకాలుగా నియమితులు అవుతారు. మొత్తం ఐఏఎస్ ల్లో 70 శాతం మంది యూపీఎస్సీ రిక్రూట్ మెంట్ ద్వారా ఎంపికై ఐఏఎస్ శిక్షణ పొంది రాష్ట్ర క్యాడర్ కు వస్తారు. మిగిలిన 30 శాతం మంది అధికారులు రాష్ట్రంలో పనిచేసే సీనియర్ గ్రూప్-1 అధికారులు. వీరు ఆర్డీవో, డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్, డ్వామా పీడీ ఇలా జిల్లా క్యాడర్ అధికారులుగా పనిచేసి ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుని ప్రమోషన్ ద్వారా ఐఏఎస్ కు ఎంపిక అవుతారు. పనితీరు, సమర్థతలో ఎవరి ఎవరూ తీసిపోరు. కానీ, రాష్ట్రంలో ప్రమోటీ ఐఏఎస్ ల విషయంలో అన్యాయం జరుగుతోందని టాక్ వినిపిస్తోందని అంటున్నారు.
ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా కీలక కార్యాలయాలు అన్నీ డైరెక్ట్ ఐఏఎస్ లతో నిండిపోయినట్లు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లేదని, కానీ, ఇప్పుడు సీఎంవోలో మొత్తం అందరూ ఆర్ఆర్ ఐఏఎస్ లే ఉన్నారని అంటున్నారు. దీంతో ప్రమోటీ ఐఏఎస్ ల పోస్టింగ్ విషయంలో వివక్ష కనిపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. తమ ఆవేదనను ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా ఆయన కార్యాలయంలో తెలియజేయానికి ఒకరిద్దరు సిద్ధమైనా వారికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఓ పత్రిక ప్రచురించిన కథనం చర్చనీయాంశమైంది.
చంద్రబాబు 4.0 ప్రభుత్వంలో ఆర్ఆర్ ఐఏఎస్ ల హవా కొనసాగుతోందని, దీనివల్ల ప్రమోటీ ఐఏఎస్ లు పనిలేని శాఖలకు డైరెక్టర్లగా, పెద్దగా గుర్తింపులేని కార్పొరేషన్లకు కమిషనర్లగా పనిచేయాల్సివస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 400 మంది ఐఏఎస్ లు ఉండగా, కూటమి ప్రభుత్వం వచ్చేవరకు అందరికి ఒకే విధమైన ప్రాధాన్యం దక్కేదని అంటున్నారు. తమ క్యాడర్ లో ఎవరికీ సీఎంవోలో పనిచేసే అవకాశం లేకపోవడంపై ప్రమోటీ ఐఏఎస్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. అదేవిధంగా 26 జిల్లాలు ఉండగా, 17 జిల్లాలకు డైరెక్ట్ ఐఏఎస్ లు కలెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కేవలం 9 జిల్లాలకు మాత్రమే ప్రమోటీ ఐఏఎస్ లను కలెక్టర్లుగా నియమించినట్లు చెబుతున్నారు. జేసీ పోస్టుల్లో సైతం 21 చోట్ల డైరెక్ట్ ఐఏఎస్లు ఉండగా, కేవలం ఐదు చోట్ల మాత్రమే ప్రమోటీలు ఉన్నారంటున్నారు.
గతంలో ఎప్పుడూ లేనట్లు ప్రస్తుతం తమను పక్కన పెట్టడంపై ప్రమోటీ ఐఏఎస్ లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఉపయోగపడటంలేదని వారి అంతర్గత చర్చల్లో వాపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో విభాగాధిపతులుగా ఉండే పోస్టుల్లో 90 శాతం డైరెక్ట్ ఐఎఎస్ లు ఉన్నారని, అదేవిధంగా పురపాలక శాఖలో కేవలం రెండు పోస్టుల్లో మాత్రమే ప్రమోటీలకు అవకాశమిచ్చారని చెబుతున్నారు.ఇటీవల జరిగిన బదిలీల్లో కీలకమైన స్థానంలో పనిచేస్తున్న ప్రమోటీ ఐఏఎస్ ను తప్పించడం కూడా వివాదమైందని అంటున్నారు. ఈ విషయమై ఆ అధికారి సీఎంవోలో ఓ సీనియర్ అధికారితో వాగ్వాదానికి దిగినట్లు ప్రచారం జరుగుతోంది. రిటైర్మెంటుకు దగ్గరలో ఉన్న తమలాంటి అధికారులను ఎలా మారుస్తారని ఆ అధికారి ప్రశ్నించినట్లు చెబుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రిని కలిసి తెలియజేయాలని ప్రమోటీ ఐఏఎస్ అధికారులు నిర్ణయించుకున్నారని అంటున్నారు. దీనిపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయని ప్రచారం జరుగుతోంది.