కొత్త షాక్ కి ట్రంప్ ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 2 తర్వాత కథే వేరు!
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ప్రపంచదేశాలు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నారు.;
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ ప్రపంచదేశాలు డొనాల్డ్ ట్రంప్ వరుసగా షాకులు ఇస్తూనే ఉన్నారు. ముందుగా అక్రమ వలసదారులకు షాకిచ్చిన ట్రంప్.. అనంతరం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టారని అంటున్నారు. విదేశీ విద్యార్థులపైనా పెను ప్రభావం చూపించారు. ఇప్పుడు సుంకాలతో విరుచుకుపడుతున్నారు.
అవును... తమ దేశ ఉత్పత్తులపై సుంకాలను విధిస్తున్న దేశాలపై ట్రంప్.. ప్రతి సుంకాలతో విరుచుకుపడుతున్నారు. తమ వ్యాపార భాగస్వామ్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు, అల్యూమినియంపై 25 శాతమున్న సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాజాగా ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా... తమ వ్యాపార భాగస్వాములపై ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధిస్తామని.. ఈ విషయంలో ఎటువంటి మార్పూ ఉండదని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వారు, వీరు అనే తారతమ్యాలేమీ లేవని.. ఏ దేశానికీ మినహాయింపు కల్పించే ఉద్దేశం తమకు లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్.. ఏప్రిల్ 2 అమెరికాకు విముక్తి కలిగించే రోజని.. ఇది వరకూ అధికారంలో ఉన్న తెలివి తక్కువ అధ్యక్షులు తాము ఏమి చేస్తున్నామో తెలియకుండా దేశ సంపదను ఇతరులకు దారపోస్తూ పోయారని.. ప్రస్తుతం అందులో కొంతభాగాన్ని సుంకాల ద్వారా తిరిగి పొందబోతున్నామని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా... ఉక్కు, అల్యూమినియంపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో... యూరోపియన్ యూనియన్ స్పందించింది. ట్రంప్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అమెరికాపై 28 బిలియన్ డాలర్ల సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ స్పందిస్తూ.. అల్యూమినియం, ఉక్కుతో పాటు దుస్తులు, గృహోపకరణాలు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ పై కూడా ఈ సుంకాలు వర్తిస్తాయని.. అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అమెరికాపై $20 బిలియన్ల సుంకాలను విధిస్తున్నట్లు కెనడా ప్రకటించింది.
ఈ సమయంలో స్పందించిన డొనాల్డ్ ట్రంప్... వాళ్లు మా దగ్గర ఎంత వసూలు చేస్తే.. తాము కూడా వాళ్ల దగ్గర నుంచి అంతే వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా... యూరోపియన్ యూనియన్ వస్తువులపై మరిన్ని సుంకాలు విధిస్తామని, ప్రపంచ వాణిజ్య యుద్ధాన్ని తెస్తామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.