మహానాడులో ముహూర్తం.. కీలక బాధ్యతల్లోకి లోకేశ్!

టీడీపీ యువనేత మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో అత్యున్నత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-03-17 14:30 GMT

టీడీపీ పెద్ద పండుగ మహానాడు. సామాన్య కార్యకర్త నుంచి అధినేత వరకు మహానాడును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే టీడీపీ మహానాడు పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న సంప్రదాయం. పార్టీ వ్యవస్థాపడుకు అన్న ఎన్టీఆర్ నుంచి ఇప్పటివరకు గ్యాప్ లేకుండా ఈ పెద్ద పండుగను నిర్వహిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక తీర్మానాలతోపాటు పార్టీ విధి, విధానాలపై మహానాడు వేదికగా సమష్టిగా నిర్ణయం తీసుకుంటారు.

కార్యకర్తల సమక్షంలో పార్టీ నిర్ణయాలపై చర్చ నిర్వహించి అందరి ఆమోదంతో పార్టీ నడుస్తుందనే విషయాన్ని తెలియజేయానికి మహానాడు నిర్వహిస్తుంటారు. అందుకే టీడీపీ మహానాడును ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఓ పండుగలా భావిస్తారు. ఇక ఈ ఏడాది మే నెలలో జరిగే టీడీపీ మహానాడులో ఓ కీలక నిర్ణయం వెలువడనుందని చెబుతున్నారు. టీడీపీ యువనేత మంత్రి నారా లోకేశ్ కు పార్టీలో అత్యున్నత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం ఏపీలో హెచ్ఆర్డీ మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న లోకేశ్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ భావినేతగా ఆయనను ప్రమోట్ చేయడానికి టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందే పార్టీ బాధ్యతలను లోకేశ్ కు అప్పగించాలనే ప్రతిపాదన పరిశీలనకు వచ్చిందని అంటున్నారు. అయితే కీలక ఎన్నికల ముందు మార్పు చేర్పులు మంచిది కాదనే అభిప్రాయంతో అప్పట్లో వాయిదా వేసుకున్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పార్టీలో లోకేశ్ కీలకంగా మారడంతో ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా పాలనకు పరిమితం అవడం వల్ల పార్టీ వ్యవహారాలను చూడటం ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో లోకేశ్ కు పార్టీలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూనే పార్టీలో లోకేశ్ ప్రాధాన్యం పెరిగేలా ఆయన కోసం ప్రత్యేకంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కొత్తగా ప్రవేశపెట్టాలని టీడీపీలో చర్చ జరుగుతోంది. 45 ఏళ్ల టీడీపీ చరిత్రలో పార్టీలో అధ్యక్షుడు మాత్రమే ఇన్నాళ్లు ఉన్నారు. ఆయనకు సమాంతరంగా ఏ వ్యవస్థ లేదు. అధ్యక్షుడి తర్వాత పార్టీ పొలిట్ బ్యూరోకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే లోకేశ్ కోసం పార్టీ అధ్యక్షుడితో సమాన అధికారాలు కల్పిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించనున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల చంద్రబాబు రిటైర్మెంట్ వరకు వేచిచూడకుండా లోకేశ్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగించినట్లు అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కీలక నిర్ణయాన్ని మహానాడులో ప్రవేశపెట్టి కార్యకర్తల ఆమోదం తీసుకోవాలని టీడీపీ వర్గాల సమాచారం.

ఇక ఈ మహానాడుకు మరో ప్రత్యేకత దక్కుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీడీపీ కూటమి, పార్టీ పరంగా టీడీపీకి రాయలసీమలో ఘన విజయం దక్కింది. పార్టీ ఆవిర్భావం తర్వాత నాలుగు దశాబ్దాలకు రాయలసీమలో పరిపూర్ణ ఆధిక్యం దక్కడంతో ఈ దఫా మహానాడును రాయలసీమలోని ప్రధానమైన కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆ తర్వాత కూడా టీడీపీ మహానాడుకు వివిధ ప్రాంతాలు వేదికయ్యాయి. కానీ, ఇప్పటివరకు కడపలో మహానాడు నిర్వహించలేదు. ప్రస్తుతానికి వేదిక ఖరారు కాకపోయినా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులతోసహా కడపలోని కీలక ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. పులివెందులలో మహానాడు నిర్వహించి వైసీపీని మరింత రాజకీయ ఇరకాటంలోకి నెట్టడమూ ఓ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ దఫా మహానాడు పండగకు టీడీపీ భారీ వ్యూహాలతో సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News