జగన్ మాట కూడా వినరా... అసలేం జరుగుతోంది ?
వైసీపీలో అసలేం జరుగుతోంది అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే పార్టీ భారీ ఓటమిని చవి చూసిన తరువాత ఒక రకమైన నిస్తేజం ఆవరించింది.;
వైసీపీలో అసలేం జరుగుతోంది అన్నది చర్చగా ఉంది. ఎందుకంటే పార్టీ భారీ ఓటమిని చవి చూసిన తరువాత ఒక రకమైన నిస్తేజం ఆవరించింది. అధినాయకుడు జగన్ అయితే బెంగళూరు టూ తాడేపల్లిగా వస్తూ పోతున్నారు అన్న విమర్శలను ప్రత్యర్ధులు చేస్తున్నారు. ఇంకో వైపు చూస్తే పార్టీలోని సీనియర్లు అంతా మూగనోము పట్టేశారు. జూనియర్లు అయితే అయోమయంలో ఉన్నారు.
పార్టీ క్యాడర్ పరిస్థితి చూస్తే పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ దిశా నిర్దేశం కాన రాక దిక్కులు చూస్తున్నారు. ఇక వైసీపీ మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో మెజారిటీ సీట్లకు వైసీపీ ఇంచార్జులుగా కీలక నేతలను అధినాయకత్వం నియమించి చాలా కాలం అయింది.
ఇక నియోజకవర్గాలలో మండలాలు మునిసిపాలిటీలు పంచాయతీలు గ్రామాలు వార్డులలలో పార్టీ కార్యవర్గాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయా నియోజకవర్గాల ఇంచార్జిల మీద ఉంది. వారిని ఆ దిశగా ప్రోత్సహించాల్సిన బాధ్యత జిల్లా అధ్యషుల మీద ఉంది. అలాగే రీజనల్ కో ఆర్డినేటర్లు మొత్తం ఇవన్నీ పరిశీలించాల్సి ఉంది.
అయితే ఇప్పటిదాకా చాలా చోట్ల చూస్తే పార్టీ కార్యవర్గాలు గ్రౌండ్ లెవెల్ దాకా ఏర్పాటు చేయలేదు. పార్టీ ముఖ్య కార్యవర్గాలతో పాటు అనుబంధ సంఘాలకు కమిటీలని వేయాల్సి ఉంది ఈ విషయంలో ఎందుకో ఇంచార్జిలు ముందుకు వెళ్ళలేకపోతున్నారు.
తాము కూడా ఆ ఇచ్చిన పదవులను అట్టే పెట్టుకుని అలాగే ఉండిపోతున్నారని అంటున్నారు. చాలా చోట్ల మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలకే ఇన్చార్జి బాధ్యతలను పార్టీ అప్పగించింది. వారే తమ నియోజకవర్గాలో బాగా పనిచేసే వారిని చూసి మరీ బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ ఆ దిశగా అడుగులు అయితే పడడంలేదు.
మంచి వారికి మచ్చ లేని వారికి కష్టపడి పనిచేసేవారికి సామాజిక వర్గ సమీకరణలను అన్నీ చూసుకుని బాధ్యతలు ఇవ్వాలని హై కమాండ్ చెబుతూ వస్తున్నా ఎవరి చెవికెక్కడంలేదు ఈ నేపథ్యంలో అధినాయకత్వం తాజాగా మరోసారి ఆదేశాలను జారీ చేసింది.
సాధ్యమైనంత తొందరగా కార్యవర్గాలను ఏర్పాటు చేసి పార్టీని బూత్ లెవెల్ దాకా తీసుకుని వెళ్ళాలని కోరింది. మరి ఈ విషయంలో ఈసారి అయినా స్పందిస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇక జగన్ ఈ కార్యకవర్గాలు అన్నీ పూర్తి అయితే జిల్లా టూర్లు మొదలెడతారు అని అంటున్నారు. ఆయన ప్రతీ జిల్లాకు వచ్చినపుడు ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాల నాయకులతో భేటీలు వేసి మరీ పార్టీ పరిస్థితులను వాకబు చేస్తారని అలాగే పార్టీని ఉత్తేజం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు.
జగన్ టూర్ చేయాలంటే ఈ కార్యవర్గాలు అన్నవి ఏర్పాటు కావాల్సి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే వైసీపీ హైకమాండ్ గట్టిగా చెబుతున్నా కార్యవర్గాలు నియామకం జరగకపోవడం మీద చర్చ సాగుతోంది. మరి వైసీపీలో ఏమి జరుగుతోంది అన్నది కూడా చర్చకు వస్తోంది. చూడాలి మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో ఏమిటో.