అసెంబ్లీలో వైసీపీ ప్రశ్నలు.. సమాధానాలు చెప్పని మంత్రులు!
అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం ఎమ్మెల్యేల హక్కు.;
అసెంబ్లీలో ప్రశ్నలు వేయడం, ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం ఎమ్మెల్యేల హక్కు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. వాటికి మంత్రులు సమాధానం ఇస్తుంటారు. కొన్నింటికి మౌఖికంగా, మరికొన్ని ప్రశ్నలకు రాతపూర్తకంగా సమాధానాలు ఇవ్వడం ఆనవాయితీ. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎవరైనా ఇలా ప్రశ్నోత్తరాలను వినియోగించుకోవచ్చు. ప్రజలు కూడా తమ ఎమ్మెల్యేలు ఏం అడుగుతున్నారనే ఆసక్తి ప్రదర్శిస్తుంటారు. అయితే ఎమ్మెల్యేలు సభకు వచ్చినా, రాకపోయినా ముందుగా ఇచ్చే ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పాల్సివుంటుంది. వ్యక్తిగతంగా వారికి ఆ సమాధానాలను పంపినా, మిగిలిన సభ్యులు కూడా ఇతర సభ్యులు ఏం అడిగారన్నది తెలుసుకోవాల్సివున్నందున సభలో చదవి వినిపిస్తుంటారు.
అయితే ప్రతిపక్ష హోదా ఇస్తే కాని అసెంబ్లీలో అడుగుపెట్టమని భీష్మించుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నలు సంధిస్తుండటమే చర్చనీయాంశమవుతోంది. సభలో అడుగుపెట్టని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో కొందరు అసెంబ్లీలో ప్రశ్నలు సమర్పిస్తున్నారు. వాటికి షెడ్యూల్ ప్రకారం మంత్రులు సమాధానాలిచ్చే సమయంలో ప్రతిపక్ష సభ్యులు లేకపోవడంతో ఆ ప్రశ్నలకు జవాబులు మమ అనిపిస్తున్నారు. సోమవారం కూడా ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సభలో సమాధానం చెప్పేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లేవగా, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు స్పందిస్తూ సభలో సభ్యులు లేకుండా సమాధానాలు చదవడం ఎందుకని, ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేసినట్లు తాము భావిస్తున్నామని రూలింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ప్రశ్నించిన సభ్యుడు ఆ తర్వాత తదుపరి ప్రశ్నకు వెళ్లిపోయారు.
సభకు హాజరుకాకుండానే వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేయడం చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. ఒకసారి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి రెండోసారి తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కానీ, సభలో తమ నియోజకవర్గ సమస్యలను ప్రశ్నిస్తున్నారు. సమాధానాలు తెలుసుకోకుండా ఇలా ప్రశ్నలు వేయడం వల్ల ఏం ఉపయోగమో కానీ వారు ప్రశ్నించడాన్ని ప్రభుత్వం స్వాగతిస్తున్నట్లు చెబుతున్నారు.