చించినాడ పూతరేకులు ఎందుకు తెమ్మన్నారు? వలంటీర్లపై మండలిలో చర్చ
2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థను కొనసాగించలేనందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు.;
ఏపీలో వలంటీర్ల వ్యవస్థపై శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని విపక్షం డిమాండ్ చేయగా, ప్రభుత్వం తోసిపుచ్చింది. శాసనమండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్లపై చర్చ జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్ యాదవ్, వరుదు కళ్యాణి వలంటీర్లపై ప్రశ్నించారు. దీనిపై మంత్రి డోలా వీరాంజనేయస్వామి సమాధానమిస్తూ పాము తన గుడ్లును తనే తినేసినట్లు వైసీపీ కార్యకర్తలను వలంటీర్లుగా నియమించిన గత ప్రభుత్వం వారికి ద్రోహం చేసిందని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ వ్యవస్థను కొనసాగించలేనందున తాము ఏమీ చేయలేమని తేల్చిచెప్పారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం వలంటీర్లకు రూ.10 వేల వేతనం చెల్లించి విధుల్లో కొనసాగించాలని వైసీపీ ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేశ్ యాదవ్, వరుదు కళ్యాణి ప్రశ్నించారు. రెండు లక్షల 60 వేల మంది జీవితాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు. పలు జీవీలను ఉటంకిస్తూ వలంటీర్ వ్యవస్థపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. వలంటీర్లు లేరని చెబుతున్న ప్రభుత్వం... తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎలా చేర్చిందని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప్రశ్నించారు. అదేవిధంగా రూ.10 వేల వేతనం పెంచుతామని చెబుతూ వలంటీర్లు స్వీట్లు, చించినాడ పూతరేకులు తెమ్మన్నారని గుర్తు చేశారు.
అయితే వైసీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలను మంత్రి డోల వీరాంజనేయస్వామి తోసిపుచ్చారు. విధుల్లో లేని వలంటీర్లను కొనసాగించలేమని చెప్పారు. 2023 నుంచి వలంటీర్లు లేకుండానే ఫేక్ రాజీనామాలు చేయించారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలే వలంటీర్లుగా ఉన్నారని గతంలో మంత్రులు ప్రకటనలు చేశారని, తమ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వమే మోసం చేసిందని విమర్శించారు. వలంటీర్లపై ప్రేమ ఉంటే గత ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేదని మంత్రి ఎదురు ప్రశ్నించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే వలంటీర్లను కొనసాగిస్తామని చెబుతూ 2023లో రెన్యువల్ చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. వలంటీర్లను భయపెట్టి ఎన్నికల్లో వాడుకోవాలని చూశారన్నారు. అయితే వైసీపీ ఆరోపించినట్లు విజయవాడ వరదల్లో తాము వలంటీర్ల సేవలను వాడుకోలేదని, గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో స్వచ్ఛందంగా పనిచేసివారి సేవలే వినియోగించుకోమన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెన్యువల్ చేద్దామని భావించామని, కానీ వారు విధుల్లో లేనందున కొనసాగించలేకపోయామన్నారు. తాము కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసిన వారిని రెన్యువల్ చేసి జీతాలు చెల్లించామని, గత ప్రభుత్వంలో విధుల్లో లేని వారికి జీతాలు ఎలా చెల్లించారని మంత్రి నిలదీశారు. అయితే మంత్రి సమాధానం తర్వాత మరో వైసీపీ సభ్యుడు తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. వలంటీర్లు విధుల్లో లేరని చెబుతున్నారని, కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి వలంటీర్లకు ఆదేశాలు ఎలా ఇచ్చారన్నారు. ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుని 2.60 లక్షల మంది యువతను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం వలంటీర్లను కొనసాగించేది లేదని తేల్చిచెప్పింది.