అక్బరుద్దీన్ అలిగిన వేళ.. ఏం జరిగింది?
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ హల్చల్ చేశారు. శాసన సభను గాంధీ భవన్ గా మార్చేశారని నిప్పులు చెరిగారు.;
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ హల్చల్ చేశారు. శాసన సభను గాంధీ భవన్ గా మార్చేశారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష సభ్యులకు అసలు మాట్లాడే అవకాశం లేనప్పుడు.. సభకు రావడం వృథా అని తేల్చి చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని పదే పదే కొరినా.. స్పీకర్ సహా మంత్రులు ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని వదిలేసి పేర్ల మార్పు కోసం పరితపిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
సభా వ్యవహారాలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ.. దీనిని మరో గాంధీ భవన్‌గా మార్చేసినట్టు స్పష్టంగా తెలుస్తోందని దుయ్యబట్టారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. సభను నడుపుతున్న తీరును ఎంఐఎంపార్టీ గర్హిస్తోందని.. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం.. ఎంఐఎం సభ్యులు సభ నుంచి బయటకు వచ్చారు. ఇది గాంధీ భవన్ కాదు.. తెలంగాణ శాసన సభ అని.. 117 మంది సభ్యుల హక్కులను రక్షించాల్సిన బాధ్యత సభా పతిపై ఉందని వ్యాఖ్యానించారు.
శాసన సభలో విపక్ష సబ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా.. కేవలం అధికార పార్టీ భజన చేసుకునేందుకు సమయాన్ని వినియోగించుకుంటోందని అక్బరుద్దీన్ అన్నారు. అంతేకాదు.. ఇలా అయితే.. ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో చెప్పాలని వ్యాఖ్యానించారు. తొలుత మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతున్న సమయంలో అక్బరుద్దీన్ తనకు మైకు ఇవ్వాలని కోరారు. దీనికి సభాపతి ప్రసాదరావు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బయటకు వెళ్లిపోయారు.