ఉక్కిరిబిక్కిరి... మోసం చేశారంటూ పోసానిపై మరో ఫిర్యాదు!
అవును... ఇప్పటికే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది.;
ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై అనుచిత వ్య్యాఖ్యలు చేశారని.. సినీరంగంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదులతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మోసం చేశారంటూ తాజాగా పోసానిపై మరో ఫిర్యాదు అందింది!
అవును... ఇప్పటికే వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న టాలీవుడ్ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఇందులో భాగంగా... తాజాగా ఆయనపై ఏకంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో... ఈ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... కర్నూలు జిల్లా, కల్లూరు మండలం, కల్లూరుకు చెందిన కే సత్యనారాయణ శెట్టి అనే వ్యక్తి సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహేష్ అనే వ్యక్తితో పాటు పోసాని తనను మోసం చేశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇందులో భాగంగా... వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి కృష్ణమురళి, మహేష్ అనే వ్యక్తులు తన వద్ద నుంచి రూ.9 లక్షలు తీసుకొని మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గచ్చిబౌలిలో కేసు పెట్టినా తనకు ఎలాంటి న్యాయం జరగలేదని సత్యనారాయణశెట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దయచేసి తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయాలని గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణలకు సత్యనారాయణ అర్జీ ఇచ్చారు. దీంతో.. ఈ ఫిర్యాదుపై టీడీపీ నేతల నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.
కాగా... పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదైనట్లు చెబుతున్నారు. వీటిలో వరుసగా పోసానికి కోర్టుల్లో బెయిల్ దక్కుతుంది! ఈ నేపథ్యంలో తాజాగా రూ.9 లక్షల మోసం ఫిర్యాదు పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయనేది వేచి చూడాలి.