మీరు మొబైల్ కు బానిసలయ్యారా.. ఇలా చెక్ చేసుకోండి

నేను మందు తాగను. జూదం అలవాటు అసలే లేదు. సిగిరెట్ అలవాటు లేదు. చివరకు నాన్ వెజ్ కూడా తినను.

Update: 2024-10-27 13:30 GMT

నేను మందు తాగను. జూదం అలవాటు అసలే లేదు. సిగిరెట్ అలవాటు లేదు. చివరకు నాన్ వెజ్ కూడా తినను. నా అంత మంచి మరెవరూ ఉండరని కొందరు తెగ సంతోషపడిపోతుంటారు. కానీ.. అలాంటి వారిలో ఒక వ్యసనం తీవ్రంగా ఉంటుంది. అదెంత? అంటే.. తమకు తాము కూడా తెలుసుకోలేనంత. ఇంతకూ ఆ వ్యసనమేమంటారా? మొబైల్ ఫోన్ పిచ్చ. ఎప్పుడైతే ల్యాండ్ ఫోన్ కాస్తా సెల్ ఫోన్ వచ్చేసిందో అప్పటినుంచి మొదలైన మేనియా.. అంతకంతకూ పెరిగి.. సెల్ ఫోన్ కాస్తా స్మార్ట్ ఫోన్ కావటం.. అందులోకి డేటా ఎంట్రీ ఇవ్వటంతో మొదలై.. సోషల్ మీడియా పుణ్యమా అని పీక్స్ కు చేరింది.

ఓవైపు ఫేస్ బుక్.. మరోవైపు ఇన్ స్టా.. ఇది సరిపోదన్నట్లుగా యూట్యూబ్.. వీటన్నింటికి మించిన బాబు వాట్సాప్.. టెలిగ్రామ్. ఇప్పుడు చెప్పినవి కొన్నే అయినా చెప్పనవి చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఆన్ లైన్ గేములు మరో లెవల్. వీటి మోజులో పడిపోయి.. పనులు వదిలేసి.. గంటలు.. గంటలు కాదు రోజులకు రోజులే.. ఉత్తనే ఖర్చు పెట్టేస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది.

ఈ మొబైల్ ఆడిక్షన్ కు చిన్నా.. పెద్దా అన్న తేడా లేదు. వయసు.. చేసే పనితోనూ సంబంధం లేదు. ఒక్కసారి ఈ మొబైల వలలో పడితే అంతే సంగతులు. మొబైల్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించేందుకు సైతం ఇష్టపడని తరం ఇప్పుడు వచ్చేసింది. దీని కారణంగా మానసిక సమస్యలకు లోనవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరాలు మొదలుకొని చిన్న పట్టణాలు.. గ్రామాల్లోనూ దీని జోరు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చిన్న ఊళ్లలోనూ మొబైల్ ఆడిక్షన్ లో పడిపోయిన వారు.. ఇప్పుడు కౌన్సిలింగ్ కేంద్రాలకుపరుగులు తీస్తున్నారు.

నిజానికి కొంతమందికి మొబైల్ అవసరం పెద్దగా ఉండదు.అయినప్పటికీ.. మొబైల్ ఫోన్ చూడకపోతే ఏదో కోల్పోతున్నట్లుగా వ్యవహరిస్తున్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. ఇళ్లు.. ఆఫీసు.. కాఫీ షాప్.. చివరకుడబ్బులు పెట్టి సినిమాకు వెళ్లిన వారిలోనూ.. ఓవైపు సినిమా నడుస్తుంటే.. ఇంకో వైపు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లో అప్డేట్స్ చెక్ చేసుకోవటం ఈ మధ్యన మరింత పెరుగుతున్న పరిస్థితి. మరి.. ఈ వ్యసనం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అన్న విషయంలోకి వెళితే.. స్వీయ నియంత్రణకు మించినది మరొకటి లేదని చెప్పాలి.

వీలైతే.. మొబైల్ ఫోన్ లో రోజుకు ఎంత టైం ఏయే ప్లాట్ ఫాంలు చూడాలేనుకున్న దానికి ఆప్షన్ పెట్టుకుంటే.. అలెర్టు చేస్తుంది. ఒకసారి అనుకున్న టైంకు చేరుకున్న తర్వాత.. ఎంత అవసరమైనాచూడనట్లుగా కండీషన్ పెట్టుకోవల్సి ఉంది. అందరికి ఇది సాధ్యం అవుతుంది. కానీ.. ఏదో కారణం చెప్పుకొని తప్పించుకునే పరిస్థితి. ఇదే మొబైల్ ఫోన్ కు మరింత అడిక్టు చేసేలా మారుస్తుందన్న మాటను నిపుణులు చెబుతున్నారు.

ఇంతకూ మనం మొబైల్ కు బానిసలం అయ్యామన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. అందుకు సైకాలజిస్టులను సంప్రదించటం ద్వారా తెలుసుకునే వీలుంది. పెద్దలు మొబైల్ ఆడిక్షన్ బారిన పడ్డారన్న దానికి నిదర్శనంగా కొన్ని లక్షణాల్ని చెబుతున్నారు. అందులో..ముఖ్యమైనవి..

- పనిపై దృష్టి పెట్టలేకపోవటం.

- ఇతరుల జీవితాలతో పోల్చి చూసుకోవటం లాంటివి.

అదే విద్యార్థులైతే ఇంట్లో అయినా బయట అయినా తమ లోకంలో తాము ఉండటం. ఇంట్లోఉన్నా..తమ రూంలలోనే ఉంటూ.. తన ప్రపంచంలో తాను బిజీగా ఉండిపోవటం. ఆహారంలోనూ..నిద్రలోనూ తేడా రావటం.. ఇతరులతో కలవకపోవటం లాంటివి కూడా మొబైల్ వ్యసనం బారిన పడిన లక్షణాలుగా చెప్పొచ్చు. ఇక.. చిన్నారుల విషయానికి వస్తే.. సరిగా అన్నం తినకపోవటం.. స్కూల్ కు వెళ్లేందుకు ఇష్టపడకపోవటం.. తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం.. మొబైల్ వద్దంటే తిరగబడటం.. నిద్రలో కలవరింతలు.. చేతులు నొక్కుకోవటం.. ఉలిక్కిపడి లేవటం లాంటి లక్షణాతో పాటు.. చేతిలో నుంచి ఫోన్ తీసుకున్నంతనే తీవ్రమైన కోపానికి గురి కావటం.. గొడవపడుతుండటం లాంటివి కూడా సీరియస్ లక్షణాలుగా చెబుతున్నారు. ఇలాంటి వారిని వెంటనే మానసికవైద్యుల వద్దకు తీసుకెళ్లటం మంచిదన్న మాట వినిపిస్తోంది.

ఇటీవల కాలంలో టైర్ టూ నగరాలకు వందలాది మంది ఫోన్ బాధితులు సంప్రదించటంతో పాటు.. తమను ఈ ఆడిక్షన్ నుంచి బయటపడేలా చేయాలని కోరుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నట్లుగా సైకాలిజిస్టులు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. స్మార్ట్‌ఫోన్‌కు అలవాటు పడుతున్న 29-40ఏళ్లలోపు వారిలో 70ుమంది మహిళలే కావటం గమనార్హం. యూట్యూబ్‌ చానెల్స్‌లో వస్ర్తాలు, వంటలు, ఆభరణాలు, హోమ్‌టూర్‌ వీడియోలు చూస్తున్నారు. ఇతరుల సామాజిక, ఆర్థిక స్థితితో పోల్చుకుంటూ కుటుంబంలో అలజడికి కారణమవుతున్నారు. ఈ తరహా గొడవలతో మానసిక నిపుణులు వద్దకు వస్తున్న దంపతులు సంఖ్య పెరుగుతోందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఈ తీరును పెద్దగా పట్టించుకోకుండా ఉండటం మరింత ప్రమాదకరంగా చెప్పాలి. అవసరానికి మాత్రమే మొబైల్ వాడేలా మార్చటం అతి పెద్ద సవాలుగా చెప్పొచ్చు. ఎవరికో చెప్పే ముందు.. ఎవరికి వారు తమను తాము ఈ విషయంలో గమనిస్తే.. వారికి సంబంధించి వారికే తెలియని కొత్త సంగతులు ఎన్నింటినో గుర్తించటం మాత్రం ఖాయమంటున్నారు. ఎందుకు ఆలస్యం. మీ గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోండి.

Tags:    

Similar News