వజ్రాల వ్యాపారి ఇంట వేడుకల్లో ప్రధాని మోదీ... ఈ సావ్జీ గురించి తెలుసా?

ఈ కార్యక్రమానికి ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు.

Update: 2024-10-30 14:01 GMT

భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఓ వజ్రాల వ్యాపారి ఇంట జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో... ఏకంగా ప్రధాని మోడీ హాజరయ్యారంటే.. ఈ వ్యాపారి ఎవరు?.. ఈయనకున్న ప్రత్యేకత ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు చర్చకు వచ్చాయి.

అవును... గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ఢోలాకియా కుమారుదు ద్రవ్య ఢోలాకియా వివాహం ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా స్పందించిన సావ్జీ ఢోలాకియా... ద్రవ్య, జాన్వి వివాహ బంధంతో ఒక్కటైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకావడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను షేర్ చేశారు.

ఎవరీ సావ్జీ ఢోలాకియా..?:

గుజరాత్ లోని అమ్రేలి జిల్లా దుధాలా గ్రామంలో ఓ రైతు కుటుంబంలో ఏప్రిల్ 12 - 1962లో జన్మించారు సావ్జీ ఢోలాకియా. తర్వాత.. 13 ఏళ్ల వయసులో 4వ తరగతిలోనే చదువు ఆపేశారు. అనంతరం తన మేనమామ దగ్గర వజ్రాల పాలిషింగ్ వర్క్ నేర్చుకుని.. వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు.

ఇదే సమయంలో... 1992లో ముంబైలో శ్రీ హరికృష్ణ ఎక్స్ పోర్ట్స్ పేరుతో వజ్రాల ఎగుమతులను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు! అయితే... ఈ తరహా వ్యాపారాలు చేసేవాళ్లు చాలా మందే ఉండొచ్చు కానీ.. తాను సంపాదించినదానిలో కొంత మొత్తాన్ని తిరిగి సమాజానికి ఇచ్చేయాలని ఈయన నమ్ముతారు.

ఆ లక్షణమే ఈయనను ప్రత్యేకంగా నిలబెట్టింది. ఈయన సంపాదించినదాంట్లో నుంచి ఏటా సిబ్బంది కోసం ఆయన కోట్లది రూపాయల కానుకలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా... 2011లో దీవాళి కానుకగా తన సిబ్బందికి ఖరీదైన బహుమతులు, బోనస్ లు అందించారు సావ్జీ. దీంతో... తొలిసారిగా ఆయన వార్తల్లో నిలిచారు.

అనంతరం 2015లో సిబ్బందికి సుమారు 491 కారులు, 200 లకు పైగా ఫ్లాట్లను కూడా బహుమతిగా అందించారు. ఇక.. 2018లో ఏకంగా 1,500 మంది ఉద్యోగులకు ఖరీదైన కానుకలు అందించారు. ఇందులో 900 మందికి ఫిక్స్డ్ డిపాజిట్లు, 600 మందికి కార్లు అందించారు. వీటిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అందిచారు.

దీంతో... సావ్జీ ఢోలాకియా పేరు ఒక్కసారిగా మరింత శబ్ధంతో దేశమంతా మార్మోగింది. వీటితో పాటు పేద యువతులకు వివాహాలు జరిపించడం.. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు సావ్జీ! ఈ నేపథ్యంలో ఆయన సేవలు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో అభినందించింది.

Tags:    

Similar News